ఇంటర్ విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం..

ఇంటర్ విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం….
- తెలంగాణలో మరో చారిత్రాత్మక సంస్కరణ
- జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
- దోశ, పూరి, మిల్లెట్ ఇడ్లీతో పోషకాహార మెనూ సిద్ధం
- 1.92 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం
- ఏడాదికి రూ.180 కోట్లతో భారీ సంక్షేమ కార్యక్రమం
- దేశంలోనే ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం అందించే తొలి రాష్ట్రంగా తెలంగాణ
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,మే 29:
ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాలతో కూడిన రుచికరమైన అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని జూన్ 12న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
విద్యార్థులు పాఠశాల దశ నుంచి ఉన్నత విద్యలోకి అడుగుపెట్టే కీలకమైన ఇంటర్మీడియట్ దశలో సరైన పోషకాహారం అందించాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఇంటర్ కళాశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఈ పథకం కింద విద్యార్థులకు వారం రోజుల పాటు ప్రత్యేక మెనూను రూపొందించారు. తొలి రోజు దోశ-చట్నీ, రెండో రోజు మిల్లెట్ ఇడ్లీ-సాంబార్, మూడో రోజు పూరి-మిక్స్‌డ్ వెజిటబుల్ కుర్మా, నాలుగో రోజు బోండా-చట్నీ, ఐదో రోజు ఇడ్లీ-చట్నీ, ఆరో రోజు ఉప్మా-చట్నీ లేదా సాంబార్ అందించనున్నారు.
రోజు విడిచి రోజు 150 మిల్లీ లీటర్ల పాలు కూడా అందించనున్నారు. అదనంగా మరింత పోషకాహారం అందించే ఇతర పదార్థాలను కూడా చేర్చే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.92 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అల్పాహారానికి రూ.80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.100 కోట్లు, మొత్తం రూ.180 కోట్లు ఏడాదికి ఖర్చు చేయనున్నారు.
జూన్ 12న ప్రారంభదశలో 64 కళాశాలల్లో 41,250 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలకు విస్తరించనుంది.
గ్రామాలు, తండాలు, ఆదివాసీ గూడేల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ఈ పథకం ఎంతో మేలు చేయనుంది.
పదో తరగతి తర్వాత చదువు మానేయకుండా ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.
దేశంలోనే తొలిసారిగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం రెండూ అందించే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, చదువుపై ఏకాగ్రత పెంచడం, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
తెలంగాణలో ప్రతి విద్యార్థి కలలకు జీవం పోయాలన్న సంకల్పంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం రాష్ట్ర విద్యా రంగంలో చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది.
