తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలకు భారీ ఏర్పాట్లు
- మేడిగడ్డ నుంచి కేటీఆర్ బస్సు యాత్ర! - November 2, 2026
- తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలకు భారీ ఏర్పాట్లు - November 2, 2026
- కరువు కాటుకు రైతులు విలవిల.. - November 2, 2026

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026కు భారీ ఏర్పాట్లు చేపడుతోంది. ఈ క్రీడల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రీడల నిర్వహణ కేవలం తాత్కాలిక కార్యక్రమంగా కాకుండా రాష్ట్రంలో శాశ్వత క్రీడాభివృద్ధికి పునాదిగా నిలవాలని స్పష్టం చేశారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాలని, భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీలకు సైతం ఉపయోగపడే విధంగా మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన కర్రసాము క్రీడను కూడా ఆతిథ్య రాష్ట్ర కోటాలో ఖేలో ఇండియా పోటీల్లో చేర్చేలా వెంటనే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించడమే లక్ష్యంగా ప్రపంచస్థాయి శిక్షణ, ఆధునిక క్రీడా వసతులు అందించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ పోటీలను రాష్ట్ర యువ క్రీడాకారులకు గొప్ప అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. క్రీడల నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ కోసం గ్రూప్-1 స్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని, వివిధ జిల్లాల్లో నిర్వహించే పోటీలను స్థానికంగా పనిచేస్తున్న అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీల్లో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి, భోజనం, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. నిర్వహణకు సంబంధించిన పురోగతిపై ప్రతి వారం నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసరమైన ఆడంబరాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరోవైపు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల కోసం సమకూర్చిన వనరులను ఖేలో ఇండియా క్రీడల నిర్వహణకు కూడా వినియోగించుకోవాలని సూచించారు. క్రీడలు, క్రీడాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం కూడా గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఉండాలని, ఈ దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులతో పాటు సుమారు 2 వేల మంది కోచింగ్ సిబ్బంది, అధికారులు పాల్గొననున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరో ఐదు నగరాల్లో మొత్తం 20 వేదికలపై 27 రకాల క్రీడా పోటీలు, ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు. తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా ప్రత్యేక శిక్షణ, సన్నాహక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు సమావేశంలో వివరించారు. వివిధ క్రీడల నిర్వహణ కోసం 20 వేదికల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడల హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (స్పోర్ట్స్) ఎ. వాణీ ప్రసాద్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ ఎ. సోనిబాలాదేవితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
