రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే

  • దసరాలోపు రెండు డీఏలు
  • సంక్రాంతికి మరో డీఏ
  • పీఆర్‌సీ నివేదికపై వేగం
  • పెండింగ్‌ బిల్లులకు అదనపు నిధులు
  • హామీల అమలుపైనే ఉద్యోగుల దృష్టి

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీఈజేఏసీ)తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ప్రస్తావించిన డీఏలు, పీఆర్‌సీ, పెండింగ్‌ బిల్లులు, సీపీఎస్‌ తదితర అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దసరా పండుగలోపు రెండు డీఏలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించగా, సంక్రాంతికి మరో డీఏ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో కొంతకాలంగా ఉద్యోగ వర్గాల్లో పేరుకుపోయిన అసంతృప్తికి తాత్కాలికంగా తెరపడింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఆధ్వర్యంలో జరిగిన చర్చలు ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో సమావేశం నుంచి బయటకు వచ్చారు. ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడంతో మరోసారి చర్చలకు మార్గం ఏర్పడింది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్‌ సంజయ్‌జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్‌హర్‌ మహేశ్‌ దత్‌ ఎక్కా సమక్షంలో టీజీఈజేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. అనంతరం టీజీఈజేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడి ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు.

పీఆర్‌సీ విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. పీఆర్‌సీ కమిటీ నివేదికను పక్షం రోజుల్లో తెప్పించుకుని, వీలైనంత వేగంగా పరిశీలించి ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం ప్రస్తుతం నెలకు రూ.1,000 కోట్ల మేర నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం, ఈ మొత్తానికి అదనంగా మరిన్ని నిధులు సమకూర్చి విడుదల చేస్తామని పేర్కొంది. మార్చి చివరి నాటికి ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు సీపీఎస్‌ రద్దు అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎస్‌ ప్రకటించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

అయితే ప్రభుత్వ హామీలతో సమస్యలన్నీ సమసిపోయినట్లు భావించే పరిస్థితి లేదని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో పలుమార్లు ఉద్యమ కార్యాచరణ ప్రకటించి చివరి దశలో చర్చలకు వెళ్లడంపై క్షేత్రస్థాయిలో ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. ఈ నెల 10న ప్రకటించిన ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో వాయిదా వేయడం కూడా ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమైంది. సామాజిక మాధ్యమాల వేదికగా జేఏసీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా రెండు డీఏలపై స్పష్టమైన హామీ రావడంతో టీజీఈజేఏసీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. అయితే లిఖితపూర్వక హామీలు, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినప్పుడే ఉద్యోగులకు పూర్తి స్థాయి భరోసా కలుగుతుందని క్షేత్రస్థాయి వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనలు కార్యరూపం దాల్చే వరకు ఉద్యోగుల దృష్టి ఇప్పుడు డీఏల విడుదల, పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు, సీపీఎస్‌ కమిటీ తదుపరి చర్యలపైనే ఉండనుంది.

You may also like...