బాల భరోసా – అనాధ పిల్లలకు భరోసా
- కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.! - September 10, 2026
- స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ దన్సింగ్ నాయక్ - September 10, 2026
- బాల భరోసా – అనాధ పిల్లలకు భరోసా - September 10, 2026
కల్వకుర్తి 09: రాష్ట్రంలోని అనాథ పిల్లలు, నిరాశ్రయులు మరియు సంరక్షణ అవసరమైన బాలల సమగ్ర రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకం ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు లేని పిల్లలు లేదా కుటుంబ పోషణ కోల్పోయిన బాలలను గుర్తించి వారికి ప్రభుత్వ సంరక్షణ కల్పించడం. అలాగే బాలల హక్కుల ఉల్లంఘన, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ బారిన పడకుండా వారిని కాపాడటమని పేర్కొన్నారు.
ధ్రువీకరణ పత్రం ప్రాముఖ్యత:
ఈ పత్రం ద్వారా ఒక చిన్నారిని ప్రభుత్వం అధికారికంగా ప్రత్యేక సంరక్షణ అవసరమైన అనాథ బాలగా గుర్తిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు లేదా సంక్షేమ వసతి గృహాలలో ప్రాధాన్యత ఆధారంగా ఉచిత సీటు లభిస్తుంది.నిబంధనల మేరకు ప్రభుత్వం అందించే నెలవారీ భత్యం నేరుగా వారి ఖాతాలో జమ అవుతుంది. పాఠశాల విద్య పూర్తయ్యాక పాలిటెక్నిక్, ఐటీఐ లేదా ఉన్నత చదువులకు ప్రత్యేక రుసుము రాయితీలు లభిస్తాయి.
దరఖాస్తు విధానం:
స్థానిక మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, మండల స్థాయి అంగన్‌వాడీ కార్యకర్త లేదా శిశు సంక్షేమ సమితి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సమర్పించాల్సిన పత్రాలు:
తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, పిల్లల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఆధార్ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రం మరియు బ్యాంకు ఖాతా వివరాలు.శిశు రక్షణ విభాగం అధికారులు పరిశీలించి అర్హత ఆధారంగా పత్రం జారీ చేస్తారు. సహాయం కోసం జిల్లా బాలల పరిరక్షణ విభాగం లేదా ఉచిత సహాయక నంబరు 1098 ను సంప్రదించవచ్చని మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ వారు తెలిపారు.
