పుస్తక పఠనంతో జ్ఞాన వికాసం

వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, ఆట వస్తువులు, ర్యాకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు శరత్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంఈఓ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్‌ఆర్‌టీ ఫౌండేషన్‌ (Books Build Brighter Future) ఫౌండర్ రమ్య, ఆమె కుమార్తె తన్విశ్రీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, ఆట వస్తువులు, లైబ్రరీ ర్యాకులను అందజేశారు.

ఈ సందర్భంగా ఫౌండర్ రమ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు వారి పరిజ్ఞానాన్ని విస్తరించేందుకు పాఠశాల లైబ్రరీలకు తమ వంతుగా పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.

ఎంఈఓ అంజయ్య మాట్లాడుతూ ఫోన్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాల ద్వారా చూసిన విషయాలు ఎక్కువకాలం గుర్తుండకపోవచ్చని, పుస్తకాలు చదివిన విషయాలు మాత్రం సుదీర్ఘకాలం జ్ఞాపకంలో నిలుస్తాయని అన్నారు. మేధాసంపత్తిని పెంపొందించుకోవడానికి గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి అవసరమని, పఠనం ద్వారా ఉన్నత విద్యను ఓపికగా అభ్యసించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

సర్పంచ్ పొనముని మాణిక్యం మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా నిలకడైన విషయ పరిజ్ఞానం సంపాదించవచ్చని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ కొంత సమయం పుస్తకాలు చదవడానికి కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడో తరగతి విద్యార్థి ఆరుష్ భగవద్గీతలోని 20 శ్లోకాలను సులభంగా జ్ఞాపకం చేసుకుని చదివి ఆకట్టుకున్నాడు. అతని ప్రతిభను అభినందిస్తూ సర్పంచ్, ఉపసర్పంచ్ మల్లేష్, ఎంఈఓ, ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఎస్‌ఆర్‌టీ ఫౌండేషన్ తరఫున బహుమతులు అందజేశారు.

పాఠశాలకు పుస్తకాలు, ర్యాకులు, ఆట వస్తువులు అందించిన ఎస్‌ఆర్‌టీ ఫౌండేషన్‌కు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఫౌండర్ రమ్యను ఎంఈఓ అంజయ్య, సర్పంచ్ పొనముని మాణిక్యం, ఉపసర్పంచ్ మల్లేష్, పాఠశాల సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో డి.చంద్రశేఖర్, లక్నాపూర్ శ్రీనివాస్, మధుసూదన్‌రావు, షేక్ సాదిక్, కరుణాకర్, కవిత తదితరులు పాల్గొన్నారు.

You may also like...