వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్‌టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన

వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్‌టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన
రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి (SSC) పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. విద్యార్థులు సులభంగా హాల్‌టికెట్ పొందేందుకు ప్రత్యేక విధానాన్ని అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
హాల్‌టికెట్ పొందడానికి విద్యార్థులు ముందుగా 8096958096 అనే వాట్సాప్ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలి. వెంటనే “Welcome to MeeSeva” అనే సందేశం వస్తుంది. ఆ తర్వాత “SSC Hall Ticket March-2026” అని టైప్ చేసి పంపితే ఒక లింక్ అందుతుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి జిల్లా, మండలం, పాఠశాల పేరును ఎంపిక చేసి, విద్యార్థి పేరు మరియు పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్‌టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అనంతరం దానిని ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రంలో ప్రింట్ తీసుకోవచ్చు.
అదేవిధంగా ఈ నెల 5 నుంచి పాఠశాలల లాగిన్లలో కూడా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆయా పాఠశాలల హెచ్ఎంలు లేదా ప్రిన్సిపాళ్ల ద్వారా కూడా విద్యార్థులు వాటిని పొందవచ్చని చెప్పారు. అలాగే ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
ఈసారి హాల్‌టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించినట్లు తెలిపారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే విద్యార్థుల ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం వరకు దూరం, చేరుకునే సమయం, చిరునామా వంటి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. హాల్‌టికెట్‌లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే పాఠశాల హెచ్ఎంల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
