రేవంత్ ఆదేశాల అమలులో డీజీపీ సెంచరీ: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్,మాజీ ఐపిఎస్

రేవంత్ రెడ్డి ఆదేశాలను అమలు చేయడంలో డీజీపీ సెంచరీ కొట్టేలా ఉన్నారని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మిర్యాలగూడలో కేటీఆర్ పాల్గొనే రైతు సదస్సుకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు దరఖాస్తు చేసుకోగా డీఎస్పీ అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు.
గత నెలలో బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు కూడా అనుమతి నిరాకరించగా హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నామని తెలిపారు. ఎన్నికలు, పండగల ఊరేగింపుల సమయంలో విధించే సెక్షన్‌ 30 పోలీస్ యాక్ట్‌ను రైతు సదస్సుపై ఏ ప్రాతిపదికన అమలు చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇటీవల హరీశ్ రావు పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడేందుకు వెళ్తే హౌస్ అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ నాయకులను పెళ్లిళ్లు, ఆసుపత్రులు, చివరకు అంత్యక్రియలకు సైతం వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించడం సరికాదని, ప్రభుత్వ తీరుపై ప్రజలు తగిన సమయంలో గట్టిగా స్పందిస్తారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

You may also like...