స్వదేశీ రక్షణ రంగానికి భారీ ప్రోత్సాహం!

జ్ఞాన తెలంగాణ, జైసల్మేర్‌: మారుతున్న ప్రపంచ యుద్ధ పరిస్థితులు, పెరుగుతున్న భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకొని భారత సైనిక సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. దేశ రక్షణలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆయుధాలు, యుద్ధ పరికరాల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించి, దేశీయంగానే అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను తయారు చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో నిర్వహించిన రక్షణ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. 2029 నాటికి రక్షణ ఉత్పత్తుల విలువను రూ.3 లక్షల కోట్లకు, రక్షణ ఎగుమతులను రూ.50 వేల కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

2014–15 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.46,429 కోట్లుగా ఉండగా, 2025–26 నాటికి రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్లకు చేరిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు. ఇదే సమయంలో రక్షణ ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయని, 2014లో రూ.2,000 కోట్ల కంటే తక్కువగా ఉన్న ఎగుమతులు ప్రస్తుతం సుమారు రూ.40 వేల కోట్ల స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ఈ వృద్ధిని మరింత వేగవంతం చేసి అంతర్జాతీయ రక్షణ మార్కెట్‌లో భారత్‌ను కీలక శక్తిగా నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా సైన్యాన్ని సిద్ధం చేయడానికి బడ్జెట్‌, మూలధన సేకరణ, సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రికార్డు స్థాయిలో రూ.7.85 లక్షల కోట్లకు పెంచినట్లు వెల్లడించారు. ఇందులో రూ.2.19 లక్షల కోట్లు మూలధన వ్యయానికి కేటాయించినట్లు వివరించారు. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సైన్యంలోకి తీసుకురావడంతో పాటు సైనికులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు.

సైనిక ఆధునీకరణలో భాగంగా అసాని, భైరవ్‌, శక్తిబాన్‌ వంటి కొత్త విభాగాల ప్రాధాన్యాన్ని రక్షణ మంత్రి ప్రస్తావించారు. అసాని డ్రోన్‌ విభాగాలు నిఘా, డ్రోన్‌ ఆధారిత దాడుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపయోగపడతాయని, భైరవ్‌ లైట్‌ కమాండో దళాలు వేగవంతమైన కార్యాచరణకు దోహదం చేస్తాయని వివరించారు. శక్తిబాన్‌ విభాగం కూడా సైనిక సామర్థ్యాల విస్తరణలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మారుతున్న యుద్ధ స్వరూపానికి అనుగుణంగా సైనిక దళాల నిర్మాణం, శిక్షణ, కార్యాచరణ విధానాల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో ఒకేసారి పలు రంగాల్లో ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే సైన్యాన్ని సిద్ధం చేయడమే లక్ష్యమన్నారు. మూడు సైనిక దళాల మధ్య సమన్వయం పెంపొందించడం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం, స్వదేశీ ఆయుధ వ్యవస్థలను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

You may also like...