చిన్న పట్టణాలే ఆర్థిక వృద్ధి కేంద్రాలు!
- ఆసియా విద్యారంగంలో ఐఐటీ హైదరాబాద్ దూకుడు.. - November 4, 2026
- న్యాయశాఖలో బదిలీల కలకలం.. 24 మంది జడ్జీలకు స్థానచలనం - November 4, 2026
- పార్ట్‌టైమ్ లెక్చరర్ల పిటిషన్ కొట్టివేత - November 4, 2026

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: దేశంలోని వందలాది చిన్న పట్టణాలను ఆర్థిక వృద్ధికి కీలక కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణాలు కేవలం ప్రజలు నివసించే ప్రాంతాలు మాత్రమే కాదని, దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ప్రధాన కేంద్రాలని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి, స్థానిక సంస్థలు, ప్రైవేటు రంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలోని పుణె మెట్రో ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుమారు రూ.21,800 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వందలాది చిన్న పట్టణాలను అభివృద్ధి కేంద్రాలుగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ దార్శనికతలో భాగంగానే ఈ ఏడాది అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయిస్తోందని, రానున్న సంవత్సరాల్లో పట్టణ ప్రాంతాలకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు. పట్టణాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్థానిక సంస్థలు, ప్రైవేటు రంగ భాగస్వాములు చొరవ చూపాలని కోరారు. అన్ని విభాగాలు ఒకే లక్ష్యంతో మిషన్ మోడ్‌లో పనిచేస్తే పట్టణాల రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు.
పుణె మెట్రో విస్తరణతో నగరంలోని పాత, కొత్త ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని తెలిపారు. పదేళ్ల క్రితం పుణె మెట్రో మొదటి దశకు శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని గుర్తుచేశారు. హింజేవాడి–శివాజీనగర్ మధ్య మెట్రో సేవలు అందుబాటులోకి రావడం ద్వారా నగరంలోని కీలక ఐటీ కేంద్రానికి మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కొత్త మెట్రో కారిడార్ రోజువారీ ప్రయాణికులకు సమయం ఆదా చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పుణె నగరం ఐటీ, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్, స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, ఉత్పాదక రంగాలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని మోదీ అన్నారు. దేశ యువత కలలు, ఆకాంక్షలకు పుణె వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. మెట్రో లైన్ నిర్మాణంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్య విధానాన్ని అనుసరించడం విజయవంతమైన నమూనాగా అభివర్ణించారు. ఇలాంటి భాగస్వామ్యాలు దేశ అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తాయని తెలిపారు.
2014లో దేశంలో మెట్రో రైలు నెట్వర్క్ కేవలం 248 కిలోమీటర్లు ఉండగా, ప్రస్తుతం దాదాపు 1,200 కిలోమీటర్లకు విస్తరించిందని ప్రధాని వివరించారు. అప్పట్లో ఐదు నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు ప్రస్తుతం 26 నగరాలకు చేరాయని, ప్రతిరోజూ కోటి మందికి పైగా ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. పుణె మెట్రో లైన్-3 హింజేవాడి ఐటీ హబ్ నుంచి శివాజీనగర్ వరకు అనుసంధానం కల్పించనుంది. డిస్ట్రిక్ట్ కోర్టు మెట్రో స్టేషన్ వరకు చేరే ఈ కారిడార్ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచనుంది. పట్టణాభివృద్ధి, రవాణా సదుపాయాల విస్తరణతోనే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమని మోదీ పేర్కొన్నారు.
