22 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహం

  • ఏడుపాయలలో ఘనంగా గెట్‌ టుగెదర్
  • చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న మిత్రులు
  • అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
  • రెండు దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన బెంచ్‌మేట్స్
  • భవిష్యత్‌లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: స్నేహానికి వయసు లేదని, కాలం గడిచినా నిజమైన అనుబంధం చెక్కుచెదరదని శంకర్‌పల్లి మండలం చెందిప్ప గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు చాటిచెప్పారు. 22 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం చిన్ననాటి మిత్రులంతా ఒక్కచోట చేరి ఆత్మీయంగా గెట్‌ టుగెదర్‌ నిర్వహించారు. ఏడుపాయల వన దుర్గా భవానీ దేవి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమం మిత్రుల మధ్య ఆనందోత్సాహాలను నింపింది.

శంకర్‌పల్లి మండల కేంద్రంలోని చెందిప్ప ప్రాథమిక పాఠశాలలో 2004లో కలిసి చదువుకున్న మిత్రులు చదువు పూర్తయిన తర్వాత ఎవరి జీవితాల్లో వారు స్థిరపడ్డారు. ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, ఇతర జీవిత ప్రయాణాలతో దూరమైనప్పటికీ చిన్ననాటి స్నేహాన్ని మాత్రం మరువలేదు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలుసుకోవడంతో నాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా సజీవమయ్యాయి. పాఠశాలలో కలిసి చదువుకున్న రోజులు, బెంచ్‌మేట్స్‌గా పంచుకున్న అనుభవాలు, బాల్యంలోని సరదా సంఘటనలను గుర్తుచేసుకుంటూ మిత్రులు ఉల్లాసంగా గడిపారు.

ఈ సందర్భంగా మిత్రులంతా ఏడుపాయల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకుని తమ స్నేహబంధం జీవితాంతం ఇలాగే కొనసాగాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. 22 ఏళ్ల తర్వాత చిన్ననాటి బెంచ్‌మేట్స్‌ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మిత్రులు పేర్కొన్నారు. జీవితంలో ఎంత దూరం వెళ్లినా బాల్య స్నేహం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని తెలిపారు.

భవిష్యత్‌లోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను తరచుగా నిర్వహించుకుని స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మిత్రులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మహేందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, సురేష్, మల్లేశం, మాణిక్య ప్రభు, యాదయ్య, వంశీ పాల్గొన్నారు. పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకున్న మిత్రులు మరోసారి తమ స్నేహానికి కొత్త ఊపిరి పోశారు. కాలం 22 ఏళ్ల పాటు దూరం చేసినా.. స్నేహం మాత్రం వారిని మళ్లీ ఒక్కచోట చేర్చింది.

You may also like...