మద్యం దుకాణాల పెరుగుదలపై హైకోర్టు తీవ్ర ఆందోళన
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ నవంబర్ 26:
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై స్థానికులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు మద్యం దుకాణాల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం, మద్యం దుకాణాల నియంత్రణపై కోర్టుకు పూర్తి అధికారం లేకపోయినా, ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు తగిన ఆదేశాలు జారీ చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ, “ఈ వేగంతో మద్యం దుకాణాలు పెరిగితే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది” అని పేర్కొనడం గమనార్హం. కనీసం రహదారిపై ప్రత్యక్షంగా కనిపించకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనే సూచన కూడా ఇచ్చారు. నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంలో ఏమన్నా ప్రత్యేక అనుమతులు తీసుకున్నారా, నియమాలు పాటించారా అన్న అంశాలపై మున్సిపల్ అధికారులు, ఎక్సైజ్ శాఖ మరియు సంబంధిత షాపు యజమానులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ విచారణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల పెరుగుదలపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వ విధానాల్లో మార్పుల అవసరం ఉందని, నివాస ప్రాంతాల్లో ఇలాంటి అనుమతులివ్వడం ప్రజల భద్రత, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని న్యాయవర్గాలు సూచిస్తున్నాయి.
