ప్రభుత్వ అధికారి ముసుగులో మోసాలు!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: ప్రభుత్వ అధికారిననే ముసుగులో ప్రజాప్రతినిధులు, సామాన్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫైనాన్స్‌ శాఖలో సీనియర్‌ అధికారిగా పరిచయం చేసుకుంటూ నకిలీ ప్రభుత్వ పథకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 53 ఏళ్ల తోట బాలాజీ నాయుడును కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ (గోల్కొండ టీమ్‌), ఫిల్మ్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేసి సస్పెన్షన్‌కు గురైనట్లు పోలీసులు గుర్తించారు.

ప్రధానంగా ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన, ముఖ్యమంత్రి నిరుద్యోగ పథకాల పేర్లతో నకిలీ పథకాలను ప్రచారం చేస్తూ ఎమ్మెల్యేలను ఆకర్షించినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలకు విరాళాలు, కంట్రిబ్యూషన్లు అందించాలంటూ వివిధ మార్గాల్లో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తిగా నమ్మించి తన మోసాలకు అధికారిక హోదా ముసుగు వేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ఈ వ్యవహారంలో నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 43 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ పథకాల పేర్లను దుర్వినియోగం చేస్తూ ప్రజలను, ప్రజాప్రతినిధులను మోసం చేసిన తీరుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసాల వెనుక మరెవరైనా ఉన్నారా? ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ వచ్చే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ధృవీకరణ లేకుండా ఎలాంటి విరాళాలు, నగదు చెల్లింపులు చేయవద్దని సూచిస్తున్నారు.

You may also like...