ఓటర్లకు మరో ఛాన్స్‌!





జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: ఓటరు జాబితాలో పేరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. వివిధ కారణాలతో ముసాయిదా ఓటరు జాబితాలో చోటు దక్కని అర్హులైన ఓటర్లు తుది జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ ప్రక్రియను నవంబర్‌ 21, 2026లోగా పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచించారు.

ఆగస్టు 17, 2026న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, డూప్లికేట్‌ ఓటర్లు (ASDD) కేటగిరీల్లో గుర్తించిన కారణంగా పలువురి పేర్లు జాబితాలో చేరలేదు. అయితే అర్హత కలిగిన ఓటర్లు తమ వివరాలను సమర్పించి తుది ఓటరు జాబితాలో పేరు చేర్చుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎన్నికల యంత్రాంగం భావిస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బూత్‌ లెవల్‌ అధికారులు (BLO) తాజా ఆదేశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తోంది. అయితే పలువురు BLOలకు ఈ మార్గదర్శకాలపై స్పష్టత లేదనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఓటరు జాబితాలో పేరు చేర్చుకోవాలనుకునే వారు తమ పరిధిలోని BLOను సంప్రదించి అవసరమైన వివరాలు, పత్రాలు సమర్పించాలి. నమోదు ప్రక్రియలో సందేహాలు ఎదురైతే ఎన్నికల సంఘం టోల్‌ఫ్రీ నంబర్‌ 1950కు కాల్‌ చేసి సహాయం పొందవచ్చు. గడువు ముగిసేలోగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను పరిశీలించుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

You may also like...