ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘాలు!
- ఆసియా విద్యారంగంలో ఐఐటీ హైదరాబాద్ దూకుడు.. - November 4, 2026
- న్యాయశాఖలో బదిలీల కలకలం.. 24 మంది జడ్జీలకు స్థానచలనం - November 4, 2026
- పార్ట్‌టైమ్ లెక్చరర్ల పిటిషన్ కొట్టివేత - November 4, 2026

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగకు ముందే గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 300 మార్కును దాటడంతో ఢిల్లీ ‘వెరీ పూర్’ కేటగిరీలోకి చేరింది. పండుగల సీజన్ ప్రారంభం కాకముందే పరిస్థితి ఇంత దారుణంగా మారడం అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది. భారత్‌లోని పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున పంట వ్యర్థాలను తగులబెట్టడం కాలుష్యానికి ప్రధాన కారణంగా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విడుదల చేసిన ఉపగ్రహ సమాచారంలో వ్యవసాయ వ్యర్థాల దహనాల తీవ్రత స్పష్టమైంది. అక్టోబర్ 1 నుంచి 29వ తేదీ వరకు పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో 13,241 దహన ఘటనలు గుర్తించగా, భారత పంజాబ్‌లో 3,158 ఘటనలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల నుంచి వాయవ్య దిశగా వీచే గాలులు పొగను ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతానికి చేరవేస్తున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలి వేగం మందగించడం వల్ల కాలుష్య కారకాలు వాతావరణంలోనే నిలిచిపోతున్నాయి. ఇప్పటికే వాహనాల పొగ, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ పనుల ధూళితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీకి పంట వ్యర్థాల పొగ మరింత ప్రమాదకరంగా మారింది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) రెండో దశ చర్యలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన రహదారులపై నీటిని చల్లడం, యాంటీ స్మాగ్ గన్లను వినియోగించడం, నిర్మాణ ప్రాంతాలపై నిఘా పెంచడం వంటి చర్యలు చేపడుతున్నారు. అయితే, ఈ తాత్కాలిక చర్యలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీపావళి సందర్భంగా బాణసంచా వినియోగం కూడా పెరిగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
