పొంగులేటి బుకాయింపుల బాగోతం.. హరీశ్‌రావు ఫైర్
- మోకిలలో ముంచెత్తుతున్న వర్షపు నీరు - September 14, 2026
- ఆర్ఆర్ఆర్కు కేంద్రం బ్రేక్! - September 14, 2026
- భాగ్యనగరంలో భక్తి వైభవం.. కొలువుదీరిన స్వర్ణ గణనాథుడు - September 14, 2026

నిషేధిత భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శించారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ముందున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన మంత్రి.. ఎదురుదాడి, వ్యక్తిగత విమర్శలు, అర్ధసత్యాల చాటున అసలు అంశాన్ని మరుగునపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తాము సభలో ఉంటే ప్రభుత్వ భూవ్యవహారాలు, అవినీతి ఆరోపణలను ఆధారాలతో బయటపెడతామనే భయంతోనే సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
ప్రశ్నలకు జవాబు లేదు.. వ్యక్తిగత దాడులేనా?
22ఏ జాబితాలో ఎన్ని ఎకరాలు చేర్చారో స్పష్టంగా చెప్పాలని అడిగినా మంత్రి నుంచి సమాధానం రాలేదని హరీశ్‌రావు అన్నారు. ప్రశ్నకు జవాబు చెప్పలేక తనపై వ్యక్తిగత ఆరోపణలకు దిగడం మంత్రి అసహనాన్ని బయటపెడుతోందని విమర్శించారు. తప్పు జరిగి ఉంటే ప్రజల ముందు అంగీకరించి క్షమాపణ చెప్పాల్సిందిపోయి.. ఎదురుదాడితో తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
పెద్దల భూములకు చకచకా క్లియరెన్స్.. పేదలకు మాత్రం చీకటేనా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి భూమిని 22ఏ జాబితా నుంచి రాత్రికి రాత్రే తొలగించారని హరీశ్‌రావు ఆరోపించారు. అదే సమయంలో సామాన్యులు, పేదల భూములపై నెలకొన్న సందేహాలకు ప్రభుత్వం ఎందుకు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారికి ఒక విధానం, సామాన్యులకు మరో విధానం ఉంటే దాన్ని ఎలా సామాజిక న్యాయం అంటారని నిలదీశారు.
భూభారతి ‘సీల్ ప్రూఫ్’ అయితే తప్పులు ఎలా?
భూభారతి వ్యవస్థలో తప్పులు జరిగినట్లు మంత్రి స్వయంగా అంగీకరించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. అసైన్డ్ పట్టా భూములు యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ అవుతున్నాయనే అంశంపై ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏమిటని నిలదీశారు. వ్యవస్థ అత్యంత భద్రమైనదని ప్రచారం చేస్తూ.. అదే వ్యవస్థలో లోపాలు బయటపడటం ప్రభుత్వ వాదనలపై అనుమానాలకు తావిస్తోందన్నారు. తనపై బురదజల్లడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని స్పష్టం చేశారు.
నాదర్‌గుల్ నుంచి ఖాజాగూడ వరకు.. ప్రశ్నల వర్షం
నాదర్‌గుల్, వట్టినాగులపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, ఖాజాగూడ భూముల వ్యవహారాలపై మంత్రి ఎందుకు మాట్లాడలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తన మామ ఎక్స్‌సర్వీస్‌మెన్ నుంచి భూమి కొనుగోలు చేశారని వివరిస్తూ, తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. గతంలోనే సమస్య ఉందని చెబుతున్న ప్రభుత్వం మూడేళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
9,200 డాక్యుమెంట్లపై సమాధానం చెప్పాలి
యజమానులకు తెలియకుండానే సుమారు 9,200 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు తమ వద్ద సమాచారం ఉందని హరీశ్‌రావు వెల్లడించారు. నిషేధిత జాబితాలో భూముల చేరిక, తొలగింపు, రిజిస్ట్రేషన్లపై పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలతో వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించడం మానేసి.. అసలు లెక్కలు, నిర్ణయాలు, బాధ్యతలపై సమాధానం చెప్పాలని పొంగులేటికి సూటిగా సవాల్ విసిరారు. బీజేపీ–బీఆర్‌ఎస్ ఒక్కటేనంటూ చిల్లర రాజకీయ ఆరోపణలు చేయడం సమస్యకు పరిష్కారం కాదని, భూముల వ్యవహారంపై ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
