ఇందిరమ్మ టవర్స్‌లో దళారుల దందాకు చెక్..
- ఇందిరమ్మ టవర్స్‌లో దళారుల దందాకు చెక్.. - September 14, 2026
- మెట్రో రెండో దశకు కేంద్రం కొర్రీలు.. - September 14, 2026
- రేవంత్ రెడ్డి ఖాతాలో మరో కాంగ్రెస్ ఇన్చార్జ్ బలి? - September 14, 2026

హైదరాబాద్‌లోని ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన ఎల్‌ఐజీ లబ్ధిదారుల విషయంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే అర్హత నిర్ధారణ పూర్తయిన వారికి ఈ వారంలోనే ఫ్లాట్ కేటాయింపు పత్రాలు అందించనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కేటాయింపు పత్రంతో పాటు మొదటి విడతలో చెల్లించాల్సిన మొత్తం, గడువు, ప్రభుత్వం నిర్దేశించిన అధికారిక బ్యాంకు ఖాతా వివరాలను కూడా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.
లక్కీ డ్రా ద్వారా మొత్తం 7,340 మందిని ఎంపిక చేయగా, ఇప్పటివరకు సుమారు 6,660 మందికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది. అందులో 5,521 మందిని అర్హులుగా తేల్చారు. మిగిలిన వారి పరిశీలనను కూడా ఈ వారంలో పూర్తి చేసి, అర్హత పొందిన వారందరికీ కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నారు.
ఈ వ్యవహారంలో మధ్యవర్తులు, బ్రోకర్ల పేరుతో జరిగే మోసాలకు లబ్ధిదారులు బలికావొద్దని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా మధ్యవర్తి పేరుతో డబ్బులు, కమీషన్ లేదా నగదు అడిగితే నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం సూచించిన అధికారిక బ్యాంకు ఖాతాలోనే చెల్లింపులు చేయాలని స్పష్టం చేశారు. కేటాయింపు పత్రంలోనే చెల్లించాల్సిన మొత్తం, గడువు, ఖాతా వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఇందిరమ్మ టవర్స్ ఇళ్లను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ‘క్యూఆర్’ పరిధిలో ఉన్న 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తోంది. లబ్ధిదారుడు మిగిలిన రూ.6 లక్షలను విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాల చెల్లింపుల విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా అధికారిక వివరాలనే అనుసరించాలని అధికారులు సూచించారు.
మరోవైపు లక్కీ డ్రాలో ఎంపిక కాని వారికి సంబంధించిన రూ.10 వేల ఈఎండీ రీఫండ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో అనర్హులు, మధ్యవర్తులు, బ్రోకర్ల మాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని లేదా 040-24603572 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ పథకం పేరుతో దళారులు డబ్బులు దండుకునే ప్రయత్నాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.
