బ్రిక్స్‌లో భారత్ దౌత్య సత్తా.. విభేదాల మధ్య ఏకాభిప్రాయం
- ఆర్ఆర్ఆర్కు కేంద్రం బ్రేక్! - September 14, 2026
- భాగ్యనగరంలో భక్తి వైభవం.. కొలువుదీరిన స్వర్ణ గణనాథుడు - September 14, 2026
- పొంగులేటి బుకాయింపుల బాగోతం.. హరీశ్‌రావు ఫైర్ - September 14, 2026

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విభేదాలు ముదురుతున్న వేళ భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు దౌత్యరంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ నిర్వహించిన ఈ సదస్సు.. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కలిగిన దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, సంక్లిష్ట అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించగల దౌత్య సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందన్నారు.
ప్రపంచం రాజకీయ, భౌగోళిక ధ్రువీకరణలతో సతమతమవుతున్న సమయంలో బ్రిక్స్ సమావేశం జరగడం సాధారణ పరిణామం కాదని జైశంకర్ పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ సభ్య దేశాలు శాంతి, భద్రత, సుస్థిరతకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఏకాభిప్రాయానికి రావడం భారత్ దౌత్య విజయంలో కీలక అంశమన్నారు. పశ్చిమాసియా సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారం కోసం పరస్పర అవగాహన, సంభాషణ అవసరమని బ్రిక్స్ స్పష్టం చేసిందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యతను కూడా సభ్య దేశాలు గుర్తించాయని తెలిపారు.
ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ
బ్రిక్స్ చర్చలు కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాలేదని జైశంకర్ వివరించారు. ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగిందన్నారు. ప్రపంచ దక్షిణ దేశాల గొంతుకను బలంగా వినిపించే దిశగా భారత్ తన అధ్యక్ష బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిందని పేర్కొన్నారు. విభిన్న అభిప్రాయాల మధ్య ఉమ్మడి ప్రయోజనాలను గుర్తించి ముందుకు సాగడం సదస్సు ప్రత్యేకతగా నిలిచిందన్నారు.
ఉగ్రవాదంపై రాజీలేని వైఖరి
ఉగ్రవాదంపై బ్రిక్స్ దేశాలు అత్యంత స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని ఇచ్చాయని జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ కారణంతో జరిగినా సమర్థించలేమని స్పష్టం చేశారన్నారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిని దిల్లీ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించడం భారత్ వైఖరికి లభించిన అంతర్జాతీయ మద్దతుకు నిదర్శనమన్నారు. ఉగ్రవాదులకు మాత్రమే కాకుండా వారికి ఆర్థిక, సంస్థాగత లేదా ఇతర సహకారం అందించే వారిని కూడా బాధ్యులను చేయాల్సిన అవసరాన్ని డిక్లరేషన్ నొక్కిచెప్పిందన్నారు.
అసాధ్యమన్న వారికి సమాధానం
బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం సాధించడం కష్టమని ముందే వ్యాఖ్యానించిన వారికి భారత్ ఫలితాలతో సమాధానం ఇచ్చిందని జైశంకర్ వ్యాఖ్యానించారు. భిన్న సిద్ధాంతాలు, విభిన్న ప్రయోజనాలు ఉన్న దేశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమర్థవంతమైన చర్చలు జరిపించడం చిన్న విషయం కాదన్నారు. సంభాషణ, దౌత్యం, అభివృద్ధి అనే ప్రధాని మోదీ దిశానిర్దేశం సదస్సు విజయానికి బలమైన పునాదిగా నిలిచిందన్నారు.
ప్రపంచానికి భారత్ శక్తివంతమైన సందేశం
బ్రిక్స్ సదస్సు ద్వారా భారత్ కేవలం ఆతిథ్య దేశంగా కాకుండా, ప్రపంచాన్ని సమన్వయం చేయగల బాధ్యతాయుతమైన దౌత్య శక్తిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని జైశంకర్ స్పష్టం చేశారు. విభేదాలు ఉన్నా సంభాషణకు తలుపులు మూయకుండా, సంక్షోభాల మధ్య సహకారానికి మార్గం చూపడం భారత దౌత్య విధానానికి నిదర్శనమన్నారు. ‘‘చాలామంది ఇది జరగదని అన్నారు. కానీ జరిగింది. అది కూడా దిల్లీలో, ప్రధాని మోదీ నాయకత్వంలో’’ అంటూ జైశంకర్ చేసిన వ్యాఖ్యలు సదస్సు విజయంపై భారత్ నమ్మకాన్ని ప్రతిబింబించాయి
