మెట్రో రెండో దశకు కేంద్రం కొర్రీలు..
- ఇందిరమ్మ టవర్స్‌లో దళారుల దందాకు చెక్.. - September 14, 2026
- మెట్రో రెండో దశకు కేంద్రం కొర్రీలు.. - September 14, 2026
- రేవంత్ రెడ్డి ఖాతాలో మరో కాంగ్రెస్ ఇన్చార్జ్ బలి? - September 14, 2026

హైదరాబాద్ మహానగర ప్రజలకు భారీ ఆశలు కల్పిస్తున్న ప్రతిపాదిత మెట్రో రెండో దశ.. ఆచరణలో మాత్రం ప్రభుత్వానికి కష్టాల కొండలా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగితాలపై 123 కిలోమీటర్ల విస్తరణ, 86 కొత్త స్టేషన్లు అంటూ భారీ ప్రణాళికను ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అడుగడుగునా అనుమతులు, రైల్వే క్రాసింగ్‌లు, భూగర్భ నిర్మాణాలు, డబుల్ డెక్కర్ పనులు అడ్డంకులుగా నిలవనున్నాయి. మొదటి దశతో పోలిస్తే రెండో దశ నిర్మాణపరంగా మరింత సంక్లిష్టంగా ఉండటంతో ప్రభుత్వం చెప్పినంత వేగంగా పనులు కదిలే పరిస్థితి ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండో దశలో ఏడు మార్గాల్లో 123 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించి 86 స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశ పూర్తయితే నగరంలో మెట్రో స్టేషన్ల సంఖ్య 143కు చేరనుంది. అయితే లక్ష్యాలు భారీగా ఉన్నప్పటికీ.. వాటిని చేరుకునే మార్గం మాత్రం అంతే కఠినంగా కనిపిస్తోంది. ప్రణాళిక ప్రకటించడం సులువే కానీ.. భూమిపై నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది.
భూగర్భ మార్గాలే అసలు తలనొప్పి
రెండో దశలో మొత్తం 3.25 కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. శంషాబాద్ విమానాశ్రయం వద్ద 1.6 కిలోమీటర్లు, హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద 1.65 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం అవసరం కానుంది. సాధారణ ప్రాంతాల్లో నిర్మాణంతో పోలిస్తే విమానాశ్రయం, రక్షణ సంస్థల పరిధిలో పనులు చేపట్టడం అంత సులభం కాదు. విమానాశ్రయ, రక్షణ శాఖల అనుమతులు, భద్రతా నిబంధనలు, సాంకేతిక పరిమితులు ప్రాజెక్టు వేగాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.
డబుల్ డెక్కర్‌పై మరో చిక్కు
మియాపూర్–పటాన్‌చెరు మార్గంలో మదీనాగూడ–చందానగర్ మధ్య 1.2 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ నిర్మాణం ప్రతిపాదించారు. కింద ఫ్లైఓవర్, పైన మెట్రో నిర్మించే ఈ విధానం సాంకేతికంగా క్లిష్టమైనదే. దీనికి కేంద్ర రవాణా శాఖతో పాటు సంబంధిత విభాగాల అనుమతులు అవసరం. అనుమతుల ప్రక్రియలో ఒక్క దశ ఆలస్యమైనా మొత్తం నిర్మాణ షెడ్యూల్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
ఆరు రైల్వే క్రాసింగ్‌లు.. ఆరు సమస్యలే!
మెట్రో రెండో దశకు రైల్వే మార్గాలు మరో పెద్ద గండంగా మారనున్నాయి. ఫలక్‌నుమా, ఆరాంఘర్, శంషాబాద్ ప్రాంతాలతో పాటు జేబీఎస్–మేడ్చల్ మార్గంలో గుండ్ల పోచంపల్లి, సుచిత్ర, అల్వాల్ వద్ద రైల్వే ట్రాక్‌లను దాటాల్సి ఉంటుంది. ఇలా మొత్తం ఆరు ప్రాంతాల్లో రైల్వే వ్యవస్థతో సమన్వయం తప్పనిసరి. రైల్వే బోర్డుతో అనుమతులు, డిజైన్‌లు, భద్రతా ప్రమాణాలపై జరిగే సుదీర్ఘ చర్చలు ప్రాజెక్టు కాలపట్టికను మరింత లాగేసే అవకాశం లేకపోలేదు.
కేంద్ర అనుమతులపై ఆధారపడాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావించినా.. కీలకమైన అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ శాఖలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. విమానాశ్రయాలు, రక్షణ సంస్థలు, రైల్వేలు, రహదారులు వంటి అనేక వ్యవస్థలతో సమన్వయం అవసరం. ఒకవైపు భారీ లక్ష్యాలు ప్రకటిస్తూ మరోవైపు అనుమతుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సి రావడం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిగా మారనుంది.
మొదటి దశే పూర్తి కాకుండానే రెండో దశకు హడావుడా?
అన్నింటికంటే కీలకమైన అంశం మొదటి దశ. ఎల్‌అండ్‌టీ నుంచి మొదటి దశను అధికారికంగా టేకోవర్ చేసిన తర్వాతే రెండో దశకు కేంద్ర ఆమోదం, నిధుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే మొదటి దశ వ్యవహారమే పూర్తిగా కొలిక్కి రాకముందే రెండో దశపై భారీ లక్ష్యాలు ప్రకటించడం ఎంతవరకు ఆచరణ సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులు, రైల్వే సమన్వయం, భూగర్భ నిర్మాణాలు, డబుల్ డెక్కర్ పనులు.. అన్నింటినీ ఒకేసారి చక్కదిద్దాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై పడనుంది.
