కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం
- కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం - September 11, 2026
- మంచినీటి సమస్యల తలెత్తకుండా చర్యలు : సర్పంచ్ ముక్కామల శ్యామల - September 11, 2026
- కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణ - September 11, 2026
కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం
కట్టంగూర్, సెప్టెంబర్ 10 : దళితులను రాజకీయ పావులుగా వాడుకుంటూ వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళిత సబ్‌ప్లాన్ కింద నిధులు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దళితుల కోసం కేటాయించిన రూ.90 వేల కోట్ల నిధులు ఎక్కడ ఖర్చు చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా నకిరేకల్ పట్టణ కేంద్రంలో దళితులు గురువారం డప్పులు మోగించి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలోనే దళితులకు నిజమైన గౌరవం, రాజకీయ ప్రాధాన్యం, సంక్షేమం లభించాయని అన్నారు. స్థానిక సంస్థలు, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లతో పాటు జనరల్ స్థానాల్లోనూ దళితులకు అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని విస్మరించి, వారికి కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. బడ్జెట్ పుస్తకాల్లో నిధులు చూపించడం కాదు.. వాటిని దళితుల కోసం వాస్తవంగా ఎంత ఖర్చు చేశారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల కోసం కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులు ఎక్కడికి వెళ్లాయో వెల్లడించాలని నిలదీశారు. ఉపముఖ్యమంత్రి, దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను పదే పదే ‘దళితుడు’ అంటూ ప్రస్తావిస్తూ అవమానించేలా వ్యవహరించడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని కులం పేరుతో అవమానించడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. దళితుల ఆత్మగౌరవం విషయంలో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయాలి అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం ప్రతిపక్ష గొంతును నొక్కాలని చూస్తోందని ఆరోపించారు. దళిత బంధు ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య బకాయిలు తదితర హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే తెలంగాణ వ్యాప్తంగా దళిత, మాదిగ సోదరులను ఏకం చేసి రెండు లక్షల డప్పులతో హైదరాబాద్‌కు కదలివస్తామని హెచ్చరించారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల మద్దతుతో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ ప్రజాపాలనను తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, నాయకులు సదానందం, మల్లయ్య, నోముల కేశవరాజు, జంగయ్య, కృష్ణకాంత్, లింగారెడ్డి పాల్గొన్నారు.
