నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

నిషేధిత భూమికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ అరెస్టు కావడం నిజామాబాద్ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అర్సపల్లి శివారులోని సర్వే నంబర్ 169/3లో ప్రభుత్వానికి చెందిన ఎకరం భూమిని నిషేధిత జాబితాలో చేర్చినప్పటికీ, అదే భూమిలోని నాలుగు ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరగడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
2023లో అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఖుద్సియా బాదర్ సహకారంతో నలుగురు వ్యక్తులు ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడం వెనుక అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవడంతో విచారణ చేపట్టారు. ఆధారాలను పరిశీలించిన అనంతరం సబ్ రిజిస్ట్రార్‌కు విషయం తెలిసే రిజిస్ట్రేషన్ జరిగిందని అధికారులు నిర్ధారించినట్లు వెల్లడైంది.
ఈ వ్యవహారంపై మూడేళ్ల క్రితమే కేసు నమోదు కాగా, తాజాగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌ఓ రఘుపతి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిషేధిత భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో సమగ్ర విచారణ నిర్వహించి నిందితులను, సబ్ రిజిస్ట్రార్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదే సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందిపేట, ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో ముంపు బాధితులకు కేటాయించిన డీ-1 పట్టా భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ, కొందరు అధికారులు నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కమ్మర్‌పల్లి, మెండోరా, నందిపేట్ మండలాల్లో నిషేధిత భూములకు జరిగిన రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. గత మూడేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయి పరిశీలన జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ప్రభుత్వం 22ఏ జాబితాలోని లోపాలను సరిదిద్దుతున్న తరుణంలోనే నిషేధిత భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగుచూడటం అధికార వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
