కామన్వెల్త్లో భారత్‌కు స్వర్ణ కాంతులు
- భూ రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మక మార్పులు - August 1, 2026
- విద్వేష ప్రసంగాలు, హేట్ క్రైమ్స్‌కు చెక్.. - August 1, 2026
- పోలీస్ నియామకాలకు ఆగస్టు 19 నుంచి దరఖాస్తులు - August 1, 2026

- పారా షాట్‌పుట్‌లో సోమన్ రాణాకు స్వర్ణం.. శుభంకు రజతం
- ఒకే ఈవెంట్లో భారత్‌కు తొలి డబుల్ పోడియం ఘనత
- మహిళల 57 కేజీల బాక్సింగ్‌లో జైస్మిన్‌కు స్వర్ణ పతకం
- 5-0 తేడాతో ఫైనల్లో ప్రత్యర్థిపై జైస్మిన్ ఏకపక్ష విజయం
- భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనతో త్రివర్ణ పతాకం రెపరెపలు
జ్ఞాన తెలంగాణ, స్పోర్ట్స్ డెస్క్:
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత క్రీడాకారులు మరోసారి తమ సత్తా చాటారు. శనివారం జరిగిన పోటీల్లో పారా అథ్లెటిక్స్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ స్వర్ణ విజయాలతో మెరిసింది. పురుషుల పారా షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభం జుయల్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించగా, మహిళల 57 కిలోల బాక్సింగ్ విభాగంలో జైస్మిన్ అద్భుత విజయంతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
పురుషుల షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో భారత పారా అథ్లెట్లు అసాధారణ ప్రతిభ కనబరిచారు. సోమన్ రాణా తన రెండో ప్రయత్నంలో 13.40 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. అనంతరం ఏ క్రీడాకారుడు కూడా ఆ దూరాన్ని అధిగమించలేకపోవడంతో ఆయన విజేతగా నిలిచాడు. మరోవైపు, శుభం జుయల్ చివరి ప్రయత్నంలో 13.28 మీటర్లు విసిరి రెండో స్థానానికి చేరుకుని రజత పతకాన్ని అందుకున్నాడు. కామెరూన్‌కు చెందిన సెడ్రిక్ ఇడ్రిస్ 12.57 మీటర్ల ప్రదర్శనతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఈ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించడమే కాకుండా, ఒకే ఈవెంట్లో స్వర్ణం, రజతం సాధించిన తొలి దేశంగా భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ డబుల్ పోడియం విజయం భారత పారా అథ్లెటిక్స్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.
సోమన్ రాణా విజయం వెనుక గొప్ప పోరాట గాథ ఉంది. 2006లో జమ్మూకశ్మీర్‌లో ల్యాండ్‌మైన్ పేలుడులో తీవ్రంగా గాయపడిన భారత సైనికుడు, అనంతరం తన జీవితాన్ని క్రీడల వైపు మళ్లించి పారా అథ్లెట్‌గా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాడు. అలాగే ఆర్మీ అధికారిగా మారాలన్న కలతో ఉన్న శుభం జుయల్ 2022లో జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయినా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పారా క్రీడల్లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే కామన్వెల్త్ పతక విజేతగా నిలవడం విశేషం.
మరోవైపు మహిళల 57 కిలోల బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ జైస్మిన్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మిచెలా వాల్ష్‌పై ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన జైస్మిన్, పదునైన పంచ్‌లు, వేగవంతమైన ఫుట్‌వర్క్‌తో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడు రౌండ్ల పాటు సాగిన పోరులో 5-0 తేడాతో ఏకగ్రీవ నిర్ణయంతో విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఐదుగురు న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా జైస్మిన్కే అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఆమె ప్రదర్శనకు నిదర్శనంగా నిలిచింది.
ఇప్పటికే మహిళల 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్ స్వర్ణ పతకం సాధించగా, జైస్మిన్ విజయంతో భారత బాక్సింగ్ శిబిరంలో ఆనందం రెట్టింపైంది. పారా అథ్లెటిక్స్, బాక్సింగ్‌లో వరుస విజయాలతో భారత్ పతకాల పట్టికలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. భారత క్రీడాకారుల పట్టుదల, ప్రతిభ మరోసారి ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాయి.
