నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల గడువు!
- తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం, సమగ్ర ప్రగతి పత్రాల అందజేత - November 5, 2026
- నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల గడువు! - November 5, 2026
- బీసీల ఆత్మగౌరవ భవనాలకు నిధులు మంజూరు - November 5, 2026

జ్ఞాన తెలంగాణ న్యూఢిల్లీ : వ్యక్తిగత స్వేచ్ఛను హరించే పోలీసు అధికారాలకు రాజ్యాంగం విధించిన గీతను సుప్రీంకోర్టు మరోసారి స్పష్టంగా గీసింది. ఒక వ్యక్తిని పోలీసులు నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. అధికారికంగా అరెస్టు నమోదు చేసిన సమయం నుంచే గడువు లెక్కించాలన్న పోలీసుల వాదనను తోసిపుచ్చింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చంద్రుర్కర్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం తప్పనిసరి. న్యాయస్థానానికి తరలించేందుకు అవసరమైన ప్రయాణ సమయాన్ని మినహాయిస్తే, ఇతర కారణాలతో ఈ గడువును పొడిగించడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. విచారణ, దర్యాప్తు, తనిఖీలు, సోదాలు, వస్తువుల స్వాధీనం పేరుతో వ్యక్తిని గంటల తరబడి నిర్బంధించి, ఆ సమయాన్ని లెక్కలోకి తీసుకోకపోవడం రాజ్యాంగ హామీని నిర్వీర్యం చేయడమేనని స్పష్టం చేసింది.
ఈ అంశంపై గతంలో ఒడిశా, మద్రాస్, కేరళ హైకోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పుల్లో అధికారిక అరెస్టుకు ముందు గడిచిన సమయాన్ని మినహాయించేందుకు అనుమతించిన అభిప్రాయాలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. నిర్బంధం, అరెస్టు మధ్య సాంకేతిక వ్యత్యాసాన్ని అడ్డుపెట్టుకుని పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడానికి పోలీసులకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
మేజిస్ట్రేట్లు కూడా పోలీసుల రిమాండ్ అభ్యర్థనలను యాంత్రికంగా ఆమోదించకూడదని ధర్మాసనం సూచించింది. నిర్బంధ సమయం, 24 గంటల నిబంధన అమలును స్వతంత్రంగా పరిశీలించాలి. గడువు ఉల్లంఘించినట్లు తేలితే రిమాండ్ తిరస్కరించి విడుదలకు ఆదేశించాల్సి ఉంటుందని పేర్కొంది.
త్రిపుర హైకోర్టు బెయిల్ నిరాకరణను సవాలు చేస్తూ నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన ఎన్‌డీపీఎస్ కేసులో ఈ తీర్పు వెలువడింది. 2025 సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 2 గంటలకు వారిని నిర్బంధించిన అధికారులు, సెప్టెంబర్ 30 ఉదయం 11 గంటలకు అధికారిక అరెస్టు నమోదు చేశారు. అయితే 24 గంటల గడువును సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 2 గంటల నుంచే లెక్కించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు పోలీసు అధికార దుర్వినియోగానికి కళ్లెం వేయడంతోపాటు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగపరమైన రక్షణను మరింత బలోపేతం చేసే ప్రాధాన్యతను సంతరించుకుంది.
