పార్ట్‌టైమ్ లెక్చరర్ల పిటిషన్ కొట్టివేత

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణను ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తేదీ నుంచి కాకుండా, సంబంధిత పోస్టులు ఏర్పడిన నాటి నుంచి వర్తింపజేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన కొందరు పార్ట్‌టైమ్ జూనియర్ కాలేజీ లెక్చరర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మొత్తం 26 మంది లెక్చరర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987-92 మధ్యకాలంలో జూనియర్ కాలేజీల్లో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ లెక్చరర్లుగా పలువురు నియమితులయ్యారు. అనంతరం 2016లో రాష్ట్ర ప్రభుత్వం వీరిలో అర్హులైన వారిని పక్కనపెట్టి కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ సిబ్బందిని క్రమబద్ధీకరించడానికి జీవో 16ను జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ లెక్చరర్లు న్యాయపోరాటానికి దిగారు. ఇదివరకే తమ తరఫున నియమితులైన పార్ట్‌టైమ్ లెక్చరర్లను 1994లో జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 212 కింద క్రమబద్ధీకరించాల్సిందని వారు వాదించారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను అనుసరించి వర్తింపజేయాలని, తమకు మాత్రమే ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలన్న అభ్యర్థనను సమర్థించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ల వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఉద్యోగాల క్రమబద్ధీకరణను గత నియామక తేదీల నుంచి అమలు చేయించుకోవాలన్న 26 మంది లెక్చరర్ల ప్రయత్నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

You may also like...