మా కష్టార్జిత బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు
- మా కష్టార్జిత బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు - September 8, 2026
బాన్సువాడ : 2017 పేస్కేల్ ఏరియర్స్‌తో పాటు రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో బాన్సువాడ పోలీసులు ముగ్గురు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేందుకు ఉదయం సుమారు 5 గంటల సమయంలో రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి దోసెపల్లి శంకర్, RTD డీఐ ఎం.డి.ఎస్. భేగ్, రిటైర్మెంట్ ఎడిసి బి.ఎల్.నారాయణలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విడిచిపెట్టినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి దోసెపల్లి శంకర్ మాట్లాడుతూ, తమ జీవితాలను ఆర్టీసీ సేవలకు అంకితం చేసి కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు రావాల్సిన 2017 పే స్కేల్ ఏరియర్స్, రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన డబ్బులు అడగడం హక్కు అని, ఆ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న రిటైర్డ్ ఉద్యోగులను అరెస్టు చేయడం బాధాకరమన్నారు.
“మా కష్టార్జిత డబ్బులు మాకు ఇవ్వాలి. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో మా పోరాటాన్ని అణచలేరు. మా బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని శంకర్ స్పష్టం చేశారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
