రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్

  • త్వరలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
  • అత్యాధునిక ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి
  • జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష సమావేశం
  • వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నియామకాలపై దృష్టి
  • ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం

హైదరాబాద్, ఆగస్టు 3: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ఉత్తర తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్ హాస్పిటల్‌గా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు పలు సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సోమవారం నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సబ్ సెంటర్ల పనితీరు, మౌలిక వసతులు, వైద్య సేవలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రజాప్రతినిధులు సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం గణనీయంగా పెరిగిందని సమావేశంలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లలో బెడ్ల కోసం ప్రతిరోజూ ప్రజాప్రతినిధులకు పెద్దఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రులను మరింత బలోపేతం చేస్తే హైదరాబాద్‌పై రోగుల ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంకాపూర్‌లో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా, దానికి మంత్రి సానుకూలంగా స్పందించి పీహెచ్‌సీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నందిపేట్ పీహెచ్‌సీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయడం, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలను కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లాలో వైద్య సేవల బలోపేతానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఇటీవల 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా నిపుణులు, 22 మంది చిన్నపిల్లల వైద్య నిపుణులను నియమించామని తెలిపారు. అదేవిధంగా సుమారు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్‌లు ఇచ్చామని, ఈ నెలాఖరులోగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో స్పెషలిస్ట్ వైద్యుల నియామకాలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.

You may also like...