కామారెడ్డి జిల్లా చరిత్రలో తొలిసారిగా 435 యూనిట్ల రక్తసేకరణ

తలసేమియా చిన్నారుల ప్రాణరక్షణకు పోలీసు శాఖ బృహత్‌ కార్యక్రమం

కామారెడ్డి: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 435 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జిల్లాలోనే తొలిసారిగా నమోదైందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహం అధ్యక్షుడు ఎండీ జమీల్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు తలసేమియా సికిల్ సెల్ పురస్కారాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. 2007 నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే శిబిరంలో 435 యూనిట్ల రక్తాన్ని సేకరించడం ఇదే తొలిసారని తెలిపారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సహకారంతో పాటు జిల్లా పోలీసు శాఖ యంత్రాంగం చొరవతో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. సేకరించిన రక్తం తలసేమియా బాధిత చిన్నారులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రక్తం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తలసేమియా చిన్నారులకు ఈ రక్తదాన శిబిరం ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీకి, పోలీసు శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తదాన శిబిరానికి సహకరించిన రక్తదాతలు, హెల్మెట్లు అందజేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహకారంతో రక్తదాతలకు పండ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కామారెడ్డి జిల్లా రక్తదాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...