అహింస, ప్రేమ, మానవత్వానికి అశోక విజయదశమి ప్రతీక

కామారెడ్డి: అహింస, శాంతి, ప్రేమ, మానవత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన చక్రవర్తి అశోకుడి ఆశయాలను కొనసాగించాలని అంబేద్కర్, బహుజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం, బాంసేఫ్, బహుజన, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 2570వ అశోక విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామ్రాట్ అశోకుడు, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్ పరికె ప్రేమ్‌కుమార్, కొత్తపల్లి మల్లన్న, క్యాతం సిద్ధరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు అశోక విజయదశమి విశిష్టతను వివరించారు.
అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల బాబు మాట్లాడుతూ, కళింగ యుద్ధం అనంతరం అశోక చక్రవర్తి హింసా మార్గాన్ని విడిచిపెట్టి బౌద్ధ ధర్మం, అహింసా సిద్ధాంతాలను స్వీకరించారని తెలిపారు. యుద్ధంలో ప్రజల ప్రాణనష్టం చూసి చలించిపోయిన అశోకుడు శాంతి, ధర్మం, మానవత్వానికి ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడి బోధనలు, పది పారమితులు, త్రిపిటకాలు, పంచశీల సూత్రాల స్ఫూర్తితో ప్రజలందరూ ప్రేమాభిమానాలతో జీవించాలని సూచించారు.
విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించాలని, ద్వేషం, పగ, ఈర్ష్య, కోపం వంటి ప్రతికూల భావాలను విడిచిపెట్టి మానవతా విలువలను అలవర్చుకోవాలని ఆకుల బాబు పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం పెంపొందించే విధంగా అశోక విజయదశమిని జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తొల్ల గంగారాం, బాంసేఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్, గౌరవ అధ్యక్షుడు సంఘీ రాజలింగం, మాల మహానాడు నాయకుడు రాజనర్సు, మద్దెల బాలయ్య, డీటీయూ నాయకుడు శంకర్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదయ్య, ప్రధాన కార్యదర్శి సంగయ్య, రవీంద్ర,లెగ్గల రాజు, బీవీఎం రాష్ట్ర అధ్యక్షుడు బొంపల్లి రవితేజ, బాంసేఫ్ జిల్లా అధ్యక్షుడు సాయి గౌతమ్, సంజీవ్‌తో పాటు పలువురు మేధావులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.

You may also like...