హత్నూరలో వేడెక్కిన రాజకీయాలు: జైభీమ్ వర్సెస్ జైశ్రీరామ్ నినాదాలతో ఉద్రిక్తత
- హత్నూరలో వేడెక్కిన రాజకీయాలు: జైభీమ్ వర్సెస్ జైశ్రీరామ్ నినాదాలతో ఉద్రిక్తత - October 21, 2026
- జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రారంభం - October 21, 2026
- రెబల్స్‌గా బరిలోకి దిగితే సస్పెన్షన్ తప్పదు! - October 21, 2026

జ్ఞానతెలంగాణ, నర్సాపూర్ ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలో దసరా పండుగ వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రావణ దహనం కార్యక్రమం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జైభీమ్ మరియు జైశ్రీరామ్ నినాదాలతో హత్నూర ప్రాంతం మార్మోగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే, దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో స్థానిక దళిత సర్పంచ్ నల్లోల ఎల్లయ్య లేకుండానే దహన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీనిపై సర్పంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా దళిత సర్పంచ్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపిస్తూ సర్పంచ్ ఎల్లయ్య మరియు ఆయన అనుచరులు హత్నూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ వివాదంపై కార్యక్రమ నిర్వాహకుడు ప్రవీణ్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఆడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు. తాము సర్పంచ్‌ను పిలిచినా ఆయనే రానని చెప్పినట్లు ఉన్న ఆడియో వైరల్ కావడంతో గొడవ మరింత ముదిరింది. ఈ ఆడియోలో సర్పంచ్ శ్రీరాముడిని అవమానించేలా మాట్లాడారంటూ బీజేపీ మరియు హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌కు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ ఆరోపణలను సర్పంచ్ నల్లోల ఎల్లయ్య తీవ్రంగా ఖండించారు. తాను కూడా హిందువునేనని, శ్రీరాముడిని ఎక్కడా అవమానించలేదని స్పష్టం చేశారు. తనపై కావాలనే రాజకీయ కుట్రతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, దళిత సర్పంచ్‌పై వివక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ దళిత సంఘాలు మరియు స్థానిక యువకులు సర్పంచ్‌కు మద్దతుగా నిలిచారు. దప్పుల చప్పుళ్లతో రోడ్డుపై భారీ ప్రదర్శన నిర్వహించి, ధీటుగా నిరసన తెలిపారు.
ఇరువర్గాలు పోటాపోటీగా ఆందోళనలు, నినాదాలతో రంగంలోకి దిగడంతో హత్నూరలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలను శాంతింపజేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు.



