పోలీసు దుస్తుల వెనుక ఒక బాధ్యతగల అధికారి ఉంటారు…

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 15 : పోలీసు దుస్తుల వెనుక ఒక బాధ్యతగల అధికారి ఉంటారు… కానీ, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసమే పరితపించే మనసున్న ఒక మనిషి ఉన్నప్పుడు, ఆ పోలీసింగ్ ప్రజాదరణ పొందుతుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం కట్టంగూర్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మునుగోటి రవీందర్ ప్రయాణం అలాంటిదే. ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 65 వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణపై ఆయనతో జ్ఞాన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ ..

జ్ఞాన తెలంగాణ : 65 వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఎస్ఐ : కట్టంగూర్‌ మండల పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి పామనగుండ్ల, యరసానిగూడెం, మాణిక్యాలమ్మగూడెం, కట్టంగూర్‌లోని నల్లగొండ క్రాస్‌రోడ్‌, ఎన్టీఆర్‌ నగర్‌, చెర్వు అన్నారం స్టేజీ వద్ద మొత్తం ఆరు బ్లాక్‌స్పాట్లను గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు లైటింగ్‌, సిగ్నల్స్‌, జీబ్రా లైన్లు, బటర్‌ఫ్లై లైట్లు ఏర్పాటు చేశాం. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

జ్ఞాన తెలంగాణ : ప్రమాదాలు ఎక్కువగా జరిగే క్రాస్‌రోడ్ల వద్ద ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు?

ఎస్ఐ: నల్లగొండ క్రాస్‌రోడ్‌ వద్ద వాహనదారులకు రహదారి స్పష్టంగా కనిపించేలా ఐమాక్స్‌ లైట్‌తోపాటు నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ట్రాఫిక్‌ కదలికలను పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. పండుగల సమయంలో వాహనాల రద్దీ పెరిగే నేపథ్యంలో ఆరు బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రతిరోజూ ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచుతున్నాం. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం.

జ్ఞాన తెలంగాణ : రాత్రివేళల్లో ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఎస్ఐ : కట్టంగూర్‌ మండల పరిధిలోని సుమారు 16 కిలోమీటర్ల జాతీయ రహదారిపై రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఫోర్‌వీలర్‌, టూవీలర్‌ పెట్రోలింగ్‌ వాహనాల ద్వారా నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాం. రాత్రివేళల్లో అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వంటి కారణాలతో ప్రమాదాలు జరగకుండా వాహనదారులను అప్రమత్తం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతాల వద్ద పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతోంది.

జ్ఞాన తెలంగాణ : ప్రమాదం జరిగినప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఎస్ఐ : జాతీయ రహదారిపై ప్రమాదం జరిగినప్పుడు వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులను నివారించేందుకు నేషనల్‌ హైవే అధికారుల సహకారంతో క్రేన్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రమాదానికి గురైన వాహనాలను వెంటనే పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడటమే మా లక్ష్యం.

జ్ఞాన తెలంగాణ : వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?

ఎస్ఐ: రోడ్డు ప్రమాదాల నివారణలో వాహనదారుల బాధ్యత ఎంతో కీలకం. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నాం. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన వల్ల కలిగే ప్రమాదాలపై వివరిస్తున్నాం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచిస్తున్నాం.

జ్ఞాన తెలంగాణ : గత రెండేళ్లలో ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యల ఫలితాలు ఎలా ఉన్నాయి?

ఎస్ఐ : ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం, బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, నిరంతర పెట్రోలింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, డ్రైవర్లకు అవగాహన కల్పించడం వంటి చర్యలతో గత రెండేళ్లుగా కట్టంగూర్‌ మండల పరిధిలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోంది. ప్రజలు కూడా ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలి. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు..1000378192.jpg

You may also like...