మణికొండలో మితిమీరిన బహిరంగ మద్యపానం..అమృత్ వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మణికొండ వాసుల డిమాండ్.
- ముదిరాజ్‌లకు న్యాయం ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత శేఖర్ ముదిరాజ్ ఫైర్. - October 24, 2026
- మణికొండలో మితిమీరిన బహిరంగ మద్యపానం..అమృత్ వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మణికొండ వాసుల డిమాండ్. - October 24, 2026
- రాజధాని రణభేరి సభ, సుర్వేష్ ముదిరాజ్ నేతృత్వంలో భారీగా తరలిన రాజేంద్రనగర్ ప్రజానీకం - October 24, 2026

మణికొండ:మణికొండ మెయిన్ రోడ్డులోని అమృత్ వైన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం స్థానికులకు, వాహనదారులకు శాపంగా మారింది. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారి ప్రస్తుతం మందుబాబులకు అడ్డగా మారిపోయింది. వైన్స్ యాజమాన్యం కనీస నిబంధనలు పాటించకుండా, ఎటువంటి కాంపౌండ్ వాల్ లేదా ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు చేయకపోవడంతో మందుబాబులు రోడ్డుపైనే బహిరంగంగా మద్యం సేవిస్తూ హల్చల్ చేస్తునారు
ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు దాటిందంటే చాలు, ఈ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఆ దారి గుండా వెళ్లే మహిళలు, పాఠశాలల నుండి వచ్చే చిన్న పిల్లలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మద్యం మత్తులో రోడ్డుపైనే పడి ఉండటం, ఇష్టానుసారంగా వాగుతూ దారిపొడవునా ఖాళీ సీసాలను, వ్యర్థాలను పారేయడం నిత్యకృత్యమైంది. దీనివల్ల అటు పరిశుభ్రత లోపించడమే కాకుండా, ఎప్పుడు ఎవరిపై దాడి జరుగుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు.
రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మరియు ప్రధాన రహదారిపైనే గుంపులు గుంపులుగా నిలబడి మద్యం తాగుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనాల రాకను కూడా గమనించని స్థితిలో మందుబాబులు రోడ్డుపైకి వస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు మణికొండ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
