కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు

కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు

కరువు మండలాలుగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలి

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్ 15 : 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి.. కనీసం ఆరు గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నారు. అకాల విద్యుత్ కోతలు, లోవోల్టేజీతో రైతుల మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంటూ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు సుమారు 100 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు.‌ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, గంటల తరబడి కోతలు విధిస్తున్నారని అన్నారు. లోవోల్టేజీ కారణంగా మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని, మరమ్మతుల కోసం రైతులు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఒకే రైతుకు పలుమార్లు మోటార్లు కాలిపోయిన పరిస్థితి ఉందని తెలిపారు. విద్యుత్ సమస్యలతో పంటలకు నీరందక ఎండిపోతుంటే రైతులు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతులకు నష్టాలు మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెగుళ్ల కారణంగా పలుమార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వస్తోందని, సాగు ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదని అన్నారు. రైతులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం లేదన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. గతంలో రైతులకు అందిన ప్రయోజనాలతో పోలిస్తే రైతు బీమా, పంటలకు బోనస్, గిట్టుబాటు ధర వంటి అంశాల్లో రైతులకు స్పష్టమైన భరోసా కల్పించాలని కోరారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు సాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎండిపోయిన పత్తి పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టంపై వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి బాధిత రైతులను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన వరి పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున, నష్టపోయిన పత్తి పంటలకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం

రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాలు, మండలాల వారీగా పంట నష్టంపై సర్వేలు నిర్వహించి బాధితుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణమే పరిహారం ప్రకటించాలని, విద్యుత్, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరామలు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, నాయకులు పోగుల నర్సింహ్మ, బీరెల్లి ప్రసాద్, గుండగోని రాములు, అంతటి శ్రీను, కొంపెల్లి సైదులు, బోడ యాదయ్య, పెద్ది బాలనర్సయ్య, గాదపాక కన్నయ్య. అల్లి లింగయ్య, సొప్పరి సైదులు, చల్ల మహేష్, తులశయ్య, సోమయ్య, మారయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.1000378415.jpg

You may also like...