బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాడితే జైలుకా..?

- ప్రజా గొంతుకను అణచివేయలేరు: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
- బీఆర్‌ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై మండిపడ్డ ఆర్‌ఎస్‌పీ
- స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా అర్ధరాత్రి జైలుకు తరలించారన్న ఆరోపణ
- బెల్ట్ షాపులు గ్రామీణ సమాజాన్ని నాశనం చేస్తున్నాయన్న ఆవేదన
- పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
- చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,మే 29:
బెల్ట్ షాపులను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున పోరాడిన బీఆర్‌ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల భవిష్యత్తును కాపాడేందుకు బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా స్వరమెత్తిన వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బెల్ట్ షాపులు వద్దనే కోరుతున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సభ్యులు మద్యం విక్రయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
“ఏ తల్లి అయినా, ఏ భార్య అయినా తమ భర్తలు, పిల్లలు సారాయి తాగాలని కోరుకోరు. ఈ 90 ఎంఎల్ సంస్కృతి గ్రామాలను గత్తరలా పట్టిపీడిస్తోంది. ఆల్కహాల్ అనేది విషం. అది కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లోని యువకులే స్వచ్ఛందంగా బెల్ట్ షాపులను తొలగించాలని కోరుతున్నారని, ప్రజల మద్దతుతో జరిగిన నిరసనలను అణచివేయడం అన్యాయమన్నారు.
ఎఫ్‌ఐఆర్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు కౌంటర్‌లోకి వెళ్లి రూ.90 వేలు తీసుకుని దాడి చేశారనేలా తప్పుడు కథనం నమోదు చేశారని ఆరోపించారు. అయితే అందులో నమోదైన సెక్షన్లు అన్నీ స్టేషన్ బెయిల్‌కు అర్హమైనవే అని స్పష్టం చేశారు.
“స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన సందర్భంలో పోలీసులు బెయిల్ ఇవ్వకుండా నేరుగా రాత్రి 2 గంటలకు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఆ సమయంలో న్యాయవాదులు అందుబాటులో ఉండరని తెలిసినా ఉద్దేశపూర్వకంగా అలా చేశారు. ఇది ముందే పన్నిన కుట్ర” అని ఆరోపించారు.
రాత్రి వేళ మేజిస్ట్రేట్‌ను ఇబ్బంది పెట్టి, వెంటనే జైలుకు పంపించేలా పరిస్థితులు సృష్టించారని విమర్శించారు.
పోలీసు అధికారులను తాను నేరుగా ప్రశ్నించానని, వారు “వాళ్లు బెల్ట్ షాపు వద్దన్నది నిజమే” అని ఒప్పుకున్నారని తెలిపారు. అయితే బెల్ట్ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు, ఫిర్యాదు చేసిన వారిపైనే చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు.
“బెల్ట్ షాపు నిర్వాహకులపై ఇచ్చిన ఫిర్యాదుకు కనీసం సంతకం కూడా తీసుకోలేదు. ఇది పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనం” అని అన్నారు.
ఈ ఘటనపై తాను, జనార్దన్ రెడ్డి కలిసి డీఎస్పీ, ఎస్‌ఐలతో మాట్లాడామని, పై అధికారులతో కూడా చర్చించామని వెల్లడించారు.
ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
బెల్ట్ షాపుల నిర్మూలన కోసం ప్రజల తరఫున బీఆర్‌ఎస్ ఉద్యమిస్తూనే ఉంటుందని, గ్రామీణ కుటుంబాల్ని కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రజా ప్రయోజనాల కోసం పోరాడిన వారిని జైలుకు పంపించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇలాంటి నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తేల్చిచెప్పారు.
“బెల్ట్ షాపులు పూర్తిగా రద్దయ్యే వరకు, ప్రజలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు.. గ్రామీణ సమాజ రక్షణ కోసం చేస్తున్న సామాజిక ఉద్యమం” అని ఆయన స్పష్టం చేశారు.
