ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన..

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన..
- అంతర్జాతీయ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహణ
- ఇందిరమ్మ ఆశీర్వాదం.. ఎన్టీఆర్ స్ఫూర్తితో సంక్షేమ పాలన
- భారత్ ఫ్యూచర్ సిటీతో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు
- సన్నబియ్యం నుంచి ఇందిరమ్మ చీరల వరకు సంక్షేమ విస్తరణ
- తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం
జ్ఞాన తెలంగాణ హైదరాబాద్ ప్రతినిధి:
ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే మహత్తర లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటసార్వభౌముడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఘనంగా ఆవిష్కరించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. దేశ చరిత్రను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్టీఆర్ జీవితాలను అధ్యయనం చేయాలని సూచించారు. వారి సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని స్పష్టం చేశారు.
నీతి, నిజాయితీ, నిబద్ధతకు ఎన్టీఆర్ నిదర్శనమని ముఖ్యమంత్రి కొనియాడారు. కులాలు, మతాలు, భాషలకు అతీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అరుదైన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అలాంటి మహానేత స్ఫూర్తి ప్రతి తరానికి అందాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు.
తెలంగాణకు చెందిన అనేక మంది నాయకులకు ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి మార్గదర్శకుడిగా నిలిచారని గుర్తుచేశారు. ఇది తెలంగాణ రాజకీయ చరిత్రలో మరువలేని ఘట్టమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రత్యేకంగా 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ భవిష్యత్తును మలుపుతిప్పే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని అన్నారు. ఇది కేవలం నిర్మాణ ప్రాజెక్టు కాదని, భవిష్యత్ తరాల ఆర్థిక స్వావలంబనకు పునాది అని వివరించారు.

ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణకు రప్పించడమే కాకుండా, రాష్ట్ర యువతను ఆ కంపెనీల్లో ఉద్యోగులుగా కాకుండా యజమానులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. యువతలో పారిశ్రామిక దృక్పథం పెంపొందించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఎన్టీఆర్ చూపిన దారినే తమ ప్రభుత్వం అనుసరిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 3.24 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనికి ఎన్టీఆర్ అమలు చేసిన రూ.2 కిలో బియ్యం పథకమే స్ఫూర్తి అని తెలిపారు.

కూడు, గుడ్డ, నీడ అనే భావనతో ఎన్టీఆర్ ప్రజలకు అందించిన సంక్షేమానికి కొనసాగింపుగా తమ ప్రభుత్వం అనేక వినూత్న పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఎన్టీఆర్ అమలు చేసిన జనతా వస్త్రాల పథకం స్ఫూర్తితో మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తున్నామని గుర్తుచేశారు.
ఇందిరమ్మ ఆశీర్వాదం, ఎన్టీఆర్ స్ఫూర్తి కలయికే నేటి తెలంగాణ ప్రజాపాలనకు బలమైన పునాది అని సీఎం స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఇద్దరు మహానాయకుల ఆలోచనా ధోరణి తెలంగాణ సంక్షేమ విధానాల్లో ప్రతిఫలిస్తోందని వివరించారు.
రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే, వాటిని అమలు చేసి మహిళా సాధికారతకు ఎన్టీఆర్ తోడ్పడ్డారని సీఎం గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు.
ప్రజల అండదండలతోనే తెలంగాణ అభివృద్ధి యాత్ర ముందుకు సాగుతోందని పేర్కొన్న సీఎం, భవిష్యత్తులోనూ ఇదే సహకారం అందించాలని ప్రజలను కోరారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేమ్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు ఎన్టీఆర్ కుమారులు నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ, కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కేవలం ఒక కార్యక్రమం కాదని, అది తెలుగు జాతి ఆత్మగౌరవానికి నివాళి, తెలంగాణ అభివృద్ధి సంకల్పానికి నూతన దిక్సూచి అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

