సుప్రీంకోర్టులో భారీ నియామకాలు..

సుప్రీంకోర్టులో భారీ నియామకాలు..


దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కీలక అడుగు పడింది. కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ హైకోర్టుల్లో సేవలందిస్తున్న నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో పాటు ఒక సీనియర్ న్యాయవాది పేరును ప్రతిపాదించింది.

సిఫార్సు చేసిన వారిలో పంజాబ్-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీచంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్, జమ్మూ కశ్మీర్-లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పళ్లి ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి. మోహన పేరును కూడా కొలీజియం ప్రతిపాదించింది.

సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం, పెండింగ్ కేసుల పరిష్కారాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ఈ నియామకాల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేసులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉండటంతో న్యాయమూర్తుల సంఖ్య పెంచడం అత్యవసరమని కొలీజియం అభిప్రాయపడింది.

కొలీజియం పంపిన సిఫార్సులను కేంద్ర న్యాయశాఖ పరిశీలించి కేబినెట్ ఆమోదానికి పంపనుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగానే నియామక ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగి, న్యాయపరమైన వ్యవహారాల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగనుంది. పెండింగ్ కేసుల విచారణ వేగవంతమై, ప్రజలకు త్వరిత న్యాయం అందే అవకాశాలు మెరుగుపడనున్నాయి. న్యాయవ్యవస్థలో ఇది కీలక పరిణామంగా న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

You may also like...

Translate »