కోదాడలో దళిత యువకుడి లాకప్ డెత్?

– కుటుంబ సభ్యుల ఆవేదన, సంఘాల ఆగ్రహం
జ్ఞానతెలంగాణ,కోదాడ :
కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ (30) అనుమానాస్పద మరణం తీవ్ర చర్చకు దారి తీసింది. కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతానికి చెందిన రాజేష్, తన ఆరోగ్య సమస్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసినప్పటికీ, ఎన్ని రోజులు గడిచినా చెక్కు అందకపోవడంతో విచారం వ్యక్తం చేశాడు. తన పేరు మీద రూ.1 లక్ష విడుదలైందని, ఆ చెక్కును దొండపాడు ప్రాంతానికి చెందిన చెడపంగు నరేష్ అనుభవిస్తూ కాజేశాడని రాజేష్ గుర్తించిన తరువాత, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. అయితే, ఫిర్యాదు చేసిన రాజేష్‌కే కష్టకాలం మొదలైంది. కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అతడిని కస్టడీలోకి తీసుకొని నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
శరీరంపై గాయాలు ఉన్న రాజేష్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి, రిమాండు నిమిత్తం హుజూర్‌నగర్ సబ్‌జైలుకు తరలించారు. అక్కడే అతనికి తీవ్రమైన శ్వాస సమస్యలు కనిపించడంతో జైలు సిబ్బంది తిరిగి అతడిని పోలీసులకు అప్పగించారు. అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే హైదరాబాద్ తరలించాలని సూచించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో రాజేష్ మరణించాడు.
తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన రాజేష్, చివరకు అదే పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు కన్నీరుమన్నీరవుతున్నారు. ఈ ఘటన బయటికి రాకుండా చేయడానికి కోదాడ డీఎస్పీ ప్రయత్నిస్తున్నాడని కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు, మానవ హక్కుల బృందాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజేష్ సోదరుడు ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
