స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: భూక్య జంపన్న

స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: భూక్య జంపన్న



జ్ఞానతెలంగాణ,ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, నర్సింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షల కోసం అవసరమైన టీసీలు, మెమోలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం కళాశాలలను ఆశ్రయిస్తే, ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు అందకపోవడంతో కళాశాల యాజమాన్యాలు ముందుగా ఫీజులు చెల్లించాలని కోరుతున్నాయని జంపన్న తెలిపారు. ప్రభుత్వ వైఫల్యానికి విద్యార్థులను బలిచేయడం బాధాకరమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.11 వేల కోట్లకు పైగా స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడటంతో పాటు కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పెండింగ్ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని జంపన్న డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి ఎలాంటి ఆటంకం లేకుండా సర్టిఫికెట్లు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని భూక్య జంపన్న హెచ్చరించారు.

You may also like...