దక్షిణాసియాలో ఇంధన ధరల షాక్..
- రేపే శంకర్‌పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

శ్రీలంక, పాకిస్థాన్ తర్వాత భారత్‌లోనూ పెంపు భయం
దక్షిణాసియా దేశాల్లో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై మరింత భారం పడింది. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చింది.ప్రభుత్వం ప్రకటించిన తాజా ధరల ప్రకారం ఆక్టేన్-92 పెట్రోల్‌పై లీటరుకు రూ.24 పెంపు చేసి ధరను రూ.317గా నిర్ణయించారు. ఆక్టేన్-95 పెట్రోల్‌పై రూ.25 పెంపుతో లీటరు ధర రూ.365కు చేరింది. ఆటో డీజిల్‌పై రూ.22 పెంపు చేయడంతో లీటరు రూ.303గా మారగా, సూపర్ డీజిల్‌పై రూ.24 పెంపుతో లీటరు రూ.353గా నిర్ణయించారు. అలాగే కిరోసిన్‌పై రూ.13 పెంపు చేసి లీటరుకు రూ.195గా నిర్ణయించారు.
ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై మరింత ప్రభావం చూపనుంది.ఇదే సమయంలో పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.55 వరకు పెంచింది. దాంతో దక్షిణాసియా దేశాల్లో ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో భారత్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇంధన ధరలపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 📈
