కామారెడ్డి బస్టాండ్‌లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం
- ఎఫ్‌పీఓల్లో చేరితే రైతులకు అధిక లాభాలు - October 24, 2026
- పీర్మాయ కుంట తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం - October 24, 2026
- అప్పుల భారం.. ఎండిన వరి పంట.. రైతు ఆత్మహత్య - October 24, 2026
కామారెడ్డి, అక్టోబర్ 23: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శుక్రవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాటలు, పాటల ద్వారా ప్రయాణికులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని, ఆన్లైన్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేయాలని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. మహిళల సహాయం కోసం షీ టీమ్ నంబర్ 8712686094ను సంప్రదించవచ్చని తెలిపారు. దొంగతనాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గుర్తుతెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అంశాలపై పోలీస్ కానిస్టేబుల్ రాజేందర్ ప్రయాణికులకు వివరించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, కానిస్టేబుల్ యు. శేషారావు, ప్రభాకర్ మాటలు, పాటల ద్వారా అవగాహన కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

