ఎఫ్‌పీఓల్లో చేరితే రైతులకు అధిక లాభాలు

తాడ్వాయి: రైతులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ (FPO)ల్లో చేరడం ద్వారా ఆర్థికంగా బలపడటంతో పాటు పంటలకు మెరుగైన ధరలు పొందవచ్చని అధికారులు సూచించారు. తాడ్వాయి సొసైటీ చైర్మన్ సంతాజి గారి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఎండ్రియాల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు ఎఫ్‌పీఓల ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఫ్‌పీఓ డొమైన్ ఎక్స్‌పర్ట్ మల్యాల శివాని మాట్లాడుతూ, రైతులు సంఘాలుగా ఏర్పడి పంటలను సమిష్టిగా మార్కెటింగ్ చేయడం ద్వారా మధ్యవర్తుల పాత్రను తగ్గించి మెరుగైన ధరలు పొందవచ్చని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలను సమూహంగా కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని వివరించారు. సమిష్టి వ్యవసాయంతో ఆదాయం పెరగడంతో పాటు ప్రభుత్వ పథకాలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతులు ఎఫ్‌పీఓల్లో చేరి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండ్రియాల్ గ్రామ సర్పంచ్ కొర్ని నర్సింలు, ఉపసర్పంచ్ గడ్డం నర్సారెడ్డి, తాడ్వాయి సొసైటీ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

You may also like...