కొండాపూర్‌లో వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవాలు




సంగారెడ్డి,కొండాపూర్:కొండాపూర్ మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. బుధవారం మండల కేంద్రమైన కొండాపూర్‌తో పాటు మారెపల్లి, తోగర్‌పల్లి, అనంతసాగర్, మల్కాపూర్, గంగారం, సీహెచ్‌ కోనాపూర్ గ్రామాల్లో దుర్గామాత నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, భక్తులు భక్తిపారవశ్యంతో శోభాయాత్రలు నిర్వహించారు. కళాకారుల నృత్యాలు, డీజే పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ వీధులన్నీ అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాల్లో ఉత్సాహంగా సందడి చేశారు.

శోభాయాత్రలు గ్రామాల ప్రధాన వీధుల గుండా సాగిన అనంతరం ఆయా గ్రామాల్లోని చెరువుల్లో అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు. భక్తులు అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ వచ్చే ఏడాది మళ్లీ రావాలని ప్రార్థించారు. దీంతో మండలవ్యాప్తంగా దుర్గామాత నిమజ్జనోత్సవాలు భక్తి, ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

You may also like...