నీటిని కాపాడుదాం.. కరువును ఎదురిద్దాం!

  • ఎల్‌నినో ప్రభావంతో కరువు ముప్పు పొంచి ఉందని హెచ్చరిక
  • ప్రతి చుక్కా విలువైనదే.. నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలి
  • తాగునీటిని ఇతర అవసరాలకు వృథా చేయవద్దు
  • నీటితోపాటు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి
  • ప్రజలకు పురపాలక చైర్‌పర్సన్ సాత ప్రవీణ్ కుమార్ పిలుపు

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ భవిష్యత్తు తరాలకు సహజ వనరులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శంకర్‌పల్లి పురపాలక చైర్‌పర్సన్ సాత ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు తీవ్రతరం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండటంతో ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలవనరుల్లో నీటి లభ్యత తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి చుక్క నీటిని జాగ్రత్తగా వినియోగించాలని, నీటి వృథాను అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఇంటి వాకిళ్లు, రోడ్లు, వాహనాలను నీటితో అనవసరంగా కడగడం మానుకోవాలని సూచించారు. బహిరంగ కుళాయిల వద్ద నీటిని వృథా చేయకుండా చూడాలని, అవసరం పూర్తయిన వెంటనే కుళాయిలను మూసివేయాలని తెలిపారు. నీటి పైపుల్లో లీకేజీలు కనిపిస్తే వెంటనే మరమ్మతులు చేయించాలని, తాగునీటిని ఇతర అవసరాలకు అనవసరంగా వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంట్లో నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు కుటుంబ సభ్యులు, పొరుగువారికి కూడా నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైర్‌పర్సన్ సూచించారు. ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను కొంతవరకు తగ్గించవచ్చని తెలిపారు. నీటిని పొదుపు చేయడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.

నీటితోపాటు విద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించాలని ఆమె కోరారు. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, టీవీలు, విద్యుత్ దీపాలను ఆపివేయాలని, పగటిపూట సాధ్యమైనంత వరకు సహజ కాంతిని వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్‌ను అనవసరంగా వినియోగించడం వల్ల వనరులపై భారం పెరుగుతుందని తెలిపారు. చిన్న చిన్న మార్పులు పాటించడం ద్వారా పెద్ద ప్రయోజనాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

ప్రజలందరూ నీటి, విద్యుత్ పొదుపును తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సాత ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. “నేటి పొదుపు రేపటి భవిష్యత్తు.. నీటిని కాపాడుదాం.. కరువును ఎదురిద్దాం” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. శంకర్‌పల్లి పట్టణాన్ని నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలిపేందుకు ప్రజల సహకారం అవసరమని ఆమె స్పష్టం చేశారు.

You may also like...