డీఎస్సీ–2008లో డీఈడీ అభ్యర్థులకు ఊరట.. 30% కోటాకు హైకోర్టు ఆమోదం
- అంబులెన్స్ సేవల్లో నిర్లక్ష్యానికి భారీ జరిమానాలు! - October 18, 2026
- డీఎస్సీ–2008లో డీఈడీ అభ్యర్థులకు ఊరట.. 30% కోటాకు హైకోర్టు ఆమోదం - October 18, 2026
- నీటిని కాపాడుదాం.. కరువును ఎదురిద్దాం! - October 18, 2026

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: డీఎస్సీ–2008 ఉపాధ్యాయ నియామకాల వ్యవహారంలో డీఈడీ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఎస్జీటీ పోస్టుల్లో డీఈడీ అభ్యర్థులకు 30 శాతం పోస్టులు కేటాయించడం సమంజసమేనని స్పష్టం చేసిన న్యాయస్థానం, ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణను సమర్థించింది. 2009లో జారీ చేసిన జీవో 28ను సవాలు చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
2008లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర విభాగాల్లో మొత్తం 52,665 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం ఎస్జీటీ పోస్టుల్లో డీఈడీ అభ్యర్థులకు 30 శాతం కేటాయించేలా నిబంధనలను సవరిస్తూ జీవో 28ను తీసుకొచ్చింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నియామక నిబంధనల్లో మార్పులు చేయడం చెల్లదని పిటిషనర్లు వాదించారు. ఈ జీవోతో పాటు దానిని సమర్థిస్తూ ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కూడా సవాలు చేశారు.
ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. దరఖాస్తులను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ శిలాశాసనం కాదని, అది నియామక ప్రక్రియకు ప్రవేశ ద్వారం మాత్రమేనని పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్న సమయంలో, పరీక్షలు నిర్వహించకముందు అభ్యర్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విధానాలను మెరుగుపరిచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఇటువంటి మార్పులు పారదర్శకంగా జరగాలని పేర్కొంది.
డీఎస్సీ–2008 నియామక ప్రక్రియలో నిష్పాక్షికతకు విరుద్ధంగా చర్యలు జరిగినట్లు గుర్తించలేదని ధర్మాసనం తెలిపింది. పరీక్షలకు హాజరై, ఫలితాలు వెలువడిన తర్వాత నిబంధనలను ప్రశ్నించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఆట ప్రారంభమైన తర్వాత నిబంధనలు మార్చారన్న వాదనను తోసిపుచ్చింది. దీంతో పిటిషన్లను కొట్టివేస్తూ జీవో 28ను సమర్థించింది.
ఈ తీర్పు డీఎస్సీ–2008 నియామకాల్లో ఎస్జీటీ పోస్టుల కేటాయింపుపై కొనసాగిన వివాదానికి కీలక స్పష్టతనిచ్చింది. నియామక ప్రక్రియలో ప్రభుత్వ విధాన నిర్ణయాలకు ఉన్న పరిధి, అభ్యర్థుల సంక్షేమం, పారదర్శకత ప్రాధాన్యాన్ని హైకోర్టు తన తీర్పులో వివరించింది.
