అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లీలావతి బయానంద్ ముందస్తు అరెస్టు

శంకర్‌పల్లి: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో శంకర్‌పల్లి మండలం బీజేపీ సీనియర్ నాయకురాలు లీలావతి బయానంద్ ని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు విద్యార్థులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని, విద్యా రంగ సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు కోరుతున్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు సిద్ధమైన లీలావతి బయానంద్‌ను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిరసనలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

You may also like...