ప్రార్థనా మందిరాల మైకుల మోతపై రఘురామ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రార్థనా మందిరాల వద్ద అధిక శబ్దంతో వినిపిస్తున్న మైకులపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రార్థనా మందిరాల వద్ద మైకుల శబ్దం ఎక్కువగా ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఇందుకోసం ఫిర్యాదు ఎలా చేయాలో నమూనా పత్రాన్ని కూడా విడుదల చేశారు.
ఫిర్యాదు చేసిన పది రోజులలోగా పోలీసులు స్పందించకపోతే సంబంధిత ఫిర్యాదు ప్రతితో పాటు ఎస్సై పేరు, ఫోన్ నంబర్‌ను తనకు పంపించాలని కోరారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను నేరుగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తానని తెలిపారు.
ప్రజా దర్బార్‌లో అనేక మంది మైకుల శబ్దంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. చట్టం ప్రకారం నిర్ణీత పరిమితికి మించి మైకులు వినియోగించడం నేరమని స్పష్టం చేశారు.
కొన్ని ప్రాంతాల్లో సరైన అనుమతులు లేకుండానే ప్రార్థనా మందిరాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. కొత్త నిర్మాణాలకు స్థానిక సంస్థల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
