దేశానికే ఆదర్శంగా భారత్ ఫ్యూచర్ సిటీ

దేశానికే ఆదర్శంగా భారత్ ఫ్యూచర్ సిటీ
- నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు
- జూన్ 2 నాటికి ఎఫ్‌సీడీఏ కార్యాలయ ప్రారంభానికి సన్నాహాలు
- అత్యాధునిక వసతులతో ప్రపంచ స్థాయి నగర నిర్మాణం
- లక్షలాది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టు
- ఫ్యూచర్ సిటీపై విమర్శలు అభివృద్ధిని అడ్డుకోవడమేనన్న మంత్రులు
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,మే 29:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న ఎఫ్‌సీడీఏ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను పరిశీలించిన అనంతరం వారు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. జూన్ 2 నాటికి ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిర్మాణంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఈ ఫ్యూచర్ సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఇది కేవలం ఒక నగర నిర్మాణం కాదని, తెలంగాణ భవిష్యత్తును మార్చే ఆర్థిక, సాంకేతిక విప్లవానికి నాంది అని పేర్కొన్నారు.
మా ప్రభుత్వ హయాంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని మంత్రులు స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి కార్యకలాపాలతో కూడిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఫ్యూచర్ సిటీకి తరలించే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల యువతకు అత్యున్నత నైపుణ్య శిక్షణ, పరిశ్రమల అనుసంధానం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ చేస్తున్న విమర్శలను మంత్రులు ఖండించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాట్లాడటం అభివృద్ధిని అడ్డుకోవాలనే రాజకీయ దురుద్దేశమేనని విమర్శించారు.
“వారు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.. మేం అభివృద్ధి పనులను ఆపేది లేదు” అని స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తయితే తెలంగాణ ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని, దేశ విదేశీ పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా మారుతుందని మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధి చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
