జడ్చర్ల ఆస్పత్రిలో కుళ్లిన మృతదేహాలు.. లక్ష్మారెడ్డి ఆగ్రహం

జ్ఞాన తెలంగాణ, మహబూబ్‌నగర్‌: జడ్చర్లలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణమని మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయలేని స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని విమర్శించారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు మృతదేహాలను గౌరవంగా అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నిర్లక్ష్యంతో కుళ్లిన మృతదేహాలను అప్పగించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. గతంలోనూ మృతదేహాలను కుక్కలు పీక్కుతినడం, విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆస్పత్రి నిర్వహణలో మార్పు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆస్పత్రిలో నిరంతర విద్యుత్‌ సరఫరాతోపాటు మెరుగైన వైద్య సేవలు, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

You may also like...