విజయదశమి వేళ.. మతసామరస్యానికి ప్రతీకగా పోచారం కుటుంబ సంప్రదాయాలు!

బాన్సువాడ: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన బాన్సువాడ గ్రామీణ మండలం పోచారంలో కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా కొనసాగుతున్న కుటుంబ సంప్రదాయాలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో దసరా వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయం నుంచి జెండాను తీసుకువచ్చి, తన నివాసం సమీపంలోని మహబూబ్ సుభాని దర్గా వద్ద ఎగురవేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హిందూ, ముస్లిం సంప్రదాయాలకు సముచిత గౌరవం ఇస్తూ కొనసాగిస్తున్న ఈ ఆచారం మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోంది.అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని రామాలయాన్ని సందర్శించి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ యువత ప్రతిష్ఠించిన దుర్గాభవానీ అమ్మవారిని దర్శించుకుని భక్తితో పూజలు నిర్వహించారు.విజయదశమి సంప్రదాయంలో భాగంగా పాలపిట్టను కూడా దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో పరిగె వెంకట్ రామ్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డితో పాటు పోచారం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

You may also like...