మియాపూర్‌లో డ్రగ్స్ కలకలం

  • ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులు అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డ్రగ్ పెడ్లర్ హనుమంతుతో పాటు డ్రగ్స్ వినియోగిస్తున్న మహేష్, ఆదర్శ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 12.6 గ్రాముల ఎమ్‌డీఎమ్ఏ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.1.5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ప్రాథమిక దర్యాప్తులో నిందితులు నైజీరియన్‌ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇతర నెట్‌వర్క్‌లపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

You may also like...

Translate »