వెస్ట్ మారేడుపల్లి జూనియర్ కళాశాల ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి: టీఏఎస్‌ఎస్ డిమాండ్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన విద్యార్థిని మృతి ఘటనపై బాధ్యులైన లెక్చరర్లపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య కమిటీ (టి.ఏ.ఎస్.ఎస్) డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల కేంద్రంలోని టీఏఎస్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు స్పష్టమైన, బాధ్యతాయుతమైన స్పందన కోరారు.
కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, పీరియడ్స్ కారణంగా కళాశాలకు ఆలస్యంగా వచ్చిన ఒక విద్యార్థిని పట్ల అక్కడి మహిళా లెక్చరర్లు అనుచితంగా, అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ వ్యవహారం విద్యార్థినిపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించి ఆమె మృతికి దారితీసిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు నేరుగా కారణమైన లెక్చరర్లపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అలాగే కళాశాల ప్రిన్సిపాల్ మరియు సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఈ దుర్ఘటనకు కారణమని టీఏఎస్‌ఎస్ పేర్కొంది. విద్యార్థినిలకు అవసరమైన భద్రత, గౌరవం, మానసిక సహాయం అందించే వ్యవస్థలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో బలహీనంగా ఉన్నాయని విమర్శించింది. ఇలాంటి ఘటనలు అనేక చోట్ల జరుగుతున్నా, చాలా సందర్భాల్లో అవి వెలుగులోకి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర, స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, అలాగే విద్యాసంస్థల్లో లింగసమానత్వం, విద్యార్థి భద్రతపై స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలని టీఏఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ విలేకరుల సమావేశంలో టీఏఎస్‌ఎస్ రాష్ట్ర కమిటీ నాయకులు మానస, శిరీష, జ్యోతి, కీర్తన, సబిత, హరిత, లక్ష్మి, అలేఖ్య, ఎంవీ ఫౌండేషన్ మండల ఇన్‌చార్జ్ నాగమణి, టీ. మంగా తదితరులు పాల్గొన్నారు.

