సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు
- రూ.1.05 కోట్ల నగదు స్వాధీనం
- కేజీ బంగారం, భారీ ఆస్తులు గుర్తింపు
- హైదరాబాద్‌లో 9 ఫ్లాట్లు వెలుగులోకి
- నిజామాబాద్‌లో 3 ఎకరాల భూమి గుర్తించిన అధికారులు
- ఇంకా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
సికింద్రాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై దాడులు చేపట్టి భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు.
మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో ఉన్న కుమార్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.05 కోట్ల నగదు, సుమారు కిలో బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి, హైదరాబాద్ నగరంలో 9 ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం.
ప్రాథమిక అంచనాల ప్రకారం కుమార్‌కు చెందిన ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. బ్యాంకు లాకర్లు, పలు ఆస్తి పత్రాలు, పెట్టుబడులపై కూడా ఏసీబీ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వ్యవహారాలపై రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడులు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతుండగా, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
